తెలంగాణ

telangana

ETV Bharat / city

'గవర్నర్ ఎలా​ ఆమోదించగలరు?.. ఆయనకున్నవి రెండే దారులు' - మూడు రాజధానులపై బిల్లుపై తెదేపా కామెంట్స్

రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ ద్వారానే ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు సాధ్యమని తెలుగుదేశం స్పష్టం చేసింది. వివాదాస్పద బిల్లులపై నిర్ణయం తీసుకునేముందు గవర్నర్ న్యాయ సలహా కోరటం లేదా రాష్ట్రపతికి పంపటం చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీలు కోరారు. శాసనమండలిలో రెండోసారి టేబుల్ కాని బిల్లులు సెలక్ట్ కమిటీ వద్ద పెండింగ్​లో ఉండగా... రూల్ 197 వాటికి ఎలా వర్తిస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు.

tdp-mlcs-on-crda-and-three-capitals-bill in ap
'గవర్నర్ ఎలా​ ఆమోదించగలరు?.. ఆయనకున్నవి రెండే దారులు'

By

Published : Jul 18, 2020, 8:38 PM IST

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపటాన్ని తెలుగుదేశం ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పుబట్టారు. వైకాపా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే 2014 పునర్విభజన చట్టం సవరణ తప్పనిసరని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. విభజన చట్టంలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే ఉంది కానీ రాజధానులు ఏర్పాటు చేసుకోవాలని ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు.

ప్రజాభిప్రాయం తీసుకోవటానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది?

ప్రభుత్వం పంపే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందు విభజన చట్టంలోని అంశాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఏదైనా బిల్లు రెండు సార్లు శాసనసభలో ఆమోదం పొంది శాసన మండలిలో తిరస్కరణకు గురైతే ప్రభుత్వం తనకున్న విచక్షణాధికారంతో దాన్ని ఆమోదింప చేసుకోవచ్చని.. కానీ ఈ రెండు బిల్లులు శాసన మండలికి ఒక్కసారే వచ్చి సెలక్ట్ కమిటీ వద్ద పెండింగ్​లో ఉన్నాయని వివరించారు. ప్రజాభిప్రాయం తీసుకోవటానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు.

'మంత్రులు తెలుసుకోవాలి'

ఎక్కడైనా అధికార వికేంద్రీకరణ ఉంటుంది కాని పరిపాలన వికేంద్రీకరణ లేదన్నది మంత్రులు తెలుసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు హితవు పలికారు. రాజధాని అంశంపై కోర్టులో వాదించటానికి రూ. 5 కోట్లు ఖర్చు పెట్టి న్యాయవాదిని ప్రభుత్వం ఎందుకు నియమించిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చట్టబద్దంగా ఉంటే.. అసలు న్యాయ వ్యవస్థతో అవసరమేముందని ప్రశ్నించారు. "సభ్యుడు కాని విజయసాయిరెడ్డి.. ఛైర్మన్ బాత్ రూం వద్ద బిల్లు ఆమోదించాలని వేడుకోవటం రాజ్యాంగబద్ధమా?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ ఆదేశాలను కార్యదర్శితో తిరస్కరించేలా చేయటం ఏ రాజ్యాంగంలో ఉందో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

'ఆమోదిస్తే.. సుప్రీంకు వెళ్తాం'

మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులను గవర్నర్ ఆమోదించరాదని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కోరారు. ఆ రెండు బిల్లులను ఎమ్మెల్సీలు, శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించినందున గవర్నర్ ఆమోదం తగదని అభిప్రాయపడ్డారు. రెండు బిల్లుల పైనా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు పెండింగ్​లో ఉన్నాయని గుర్తు చేశారు. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపించాలని సూచించారు. అలా కాకుండా గవర్నర్ బిల్లులను ఆమోదిస్తే, శాసనమండలిని అవమానించినట్లేనని రాజేంద్రప్రసాద్ తెలిపారు. బిల్లులను ఆమోదిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని రక్షించవలసిన గవర్నర్, రాష్ట్రప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా వ్యవహరించకూడదని రాజేంద్రప్రసాద్ కోరారు. గవర్నర్ రెండు బిల్లులను ఆమోదిస్తే న్యాయపోరాటం చేయాలని తెలుగుదేశం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవీ చూడండి: ఎక్కడా ఎరువుల కొరతని వినిపించకూడదు : నిరంజన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details