TDP MLAs on Liquor deaths: నాటుసారా తాగి ఎంతో మంది చనిపోతున్నా సీఎం జగన్కు పట్టడం లేదని ఏపీ తెదేపా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే వరుసగా మూడోరోజు కూడా తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై కనీసం సభలో చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. సభలో ముఖ్యమంత్రి జగన్ అసత్యాలపై సభాహక్కుల నోటీసులు ఇచ్చినా.. స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారాపై సమాధానం చెప్పలేకే తమను సస్పెన్షన్ వేశారని మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబడితే తమను సస్పెండ్ చేశారని తెదేపా ఎమ్మెల్యేలు అన్నారు. నాటుసారా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సారా ధ్వంసం చేశామని పోలీసులు చెబుతున్నా.. సీఎం జగన్ మాత్రం నాటుసారా కాయనేలేదంటున్నారని తెలిపారు. నాటుసారా మృతులను సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా? అని మండిపడ్డారు. అధిక మద్యం ధరల కారణంగా నాటుసారా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోపించారు.