Forensic lab report on MP Gorantla video : ఏపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో నిజమైనదేనని.. ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధరించిందని తెదేపా నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వంగలపూడి అనిత వెల్లడించారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు.. ప్రైవేట్‌గా ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియో పంపినట్లు చెప్పారు. ఈ వీడియోను పరిశీలించిన ల్యాబ్ నిపుణుడు జిమ్ స్టాఫ్ వార్డ్.. మార్ఫింగ్ జరగలేదని రిపోర్టు ఇచ్చారని తెలిపారు. వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవేనని.. అందులో ఎలాంటి ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ జరగలేదని ల్యాబ్ నివేదికలో పేర్కొన్నట్టు చెప్పారు. ల్యాబ్ రిపోర్టునూ విడుదల చేశారు.
వీడియోలో మార్ఫింగ్ జరగలేదనటానికి.. జగన్‌కు ఈ ఆధారాలు చాలా? ఇంకేమైనా కావాలా? అని తెదేపా నేతలు ప్రశ్నించారు. నిస్సిగ్గుగా ఇంకా సీఎం జగన్.. ఎంపీని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మహిళలకు ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు. ఎంపీ పదవిలో ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హత మాధవ్ కు లేదన్నారు. మాధవ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపినా ఉపయోగం లేదని ప్రభుత్వం చెప్పటం పచ్చి అబద్ధమని అన్నారు.