TDP leaders on Narayana arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై.. తెదేపా నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో విద్యాబోధన చేస్తున్న నారాయణ విద్యాసంస్థలంటే ఆషామాషీగా ఉందా అని ప్రశ్నించారు. 6 లక్షల మందికి పైగా విద్యార్థులు, 50 వేల నుంచి 60 వేల మంది ఉద్యోగులతో ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థగా నారాయణ ఖ్యాతి గడించిందని గుర్తు చేశారు.
TDP leaders on Narayana arrest: ఫౌండర్ ఛైర్మన్ నారాయణ అయినప్పటికీ.. ప్రస్తుతం ఆయన పిల్లలు విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటున్నారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక విద్యాసంస్థల బాధ్యతలను నారాయణ పూర్తిగా వదిలేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు లీకైతే ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారని.. విద్యాశాఖ మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"నారాయణ విద్యాసంస్థలంటే అంత ఆషామాషీగా ఉందా? దేశంలోని 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసంస్థల బాధ్యతలను ఆయన పిల్లలు చూసుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక విద్యాసంస్థల బాధ్యతలను పూర్తిగా వదిలేశారు. నారాయణ విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే ఛైర్మన్‌ను అరెస్టు చేస్తారా? విద్యా శాఖలో లీకేజీపై విద్యాశాఖ మంత్రిని అరెస్టు చేయాల్సిందే."- సోమిరెడ్డి, మాజీ మంత్రి
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ఆ పాపాన్ని మాజీ మంత్రి నారాయణపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంతో... తాడో పేడో తేల్చుకుంటామన్న ఆయన... అరెస్టులకు భయపడమని స్పష్టం చేశారు.