ఏపీలోని గుంటూరు జిల్లాలో తెదేపా మద్దతుదారులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లో వైకాపాకు అనుకూలంగా పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ.. అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి - andhra pradhesh latest news
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డి... తెదేపా బలపరిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు... పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వినుకొండ మండలంలోని పిట్టంబండ, ముమ్మిడివరం, చెట్టుపల్లి గ్రామాల్లో తెదేపా మద్దతుదారులను స్థానిక సీఐ వేధిస్తున్నారని ఆరోపించారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల పిల్లలపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలకు నిరసనగా ఆందోళన చేసిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. మాచర్ల నియోజకవర్గంలో సీఐ భక్తవత్సలరెడ్డి నేరుగా బెదిరింపులకు దిగారని ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన పరిణామాలపై విచారణ జరిపించి, అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. తెదేపా నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేసి ఎన్నికలు సజావుగా సాగేందుకు అదనపు భద్రతా బలగాలను నియమించాలని విజ్ఞప్తి చేశారు.