Achchennaidu on Lepakshi lands ఏపీలోని అనంతపురం జిల్లాలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కి అక్రమంగా చేసిన వేల ఎకరాల భూ కేటాయింపుల్ని వైకాపా ప్రభుత్వం రద్దుచేసి, ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.
Lepakshi Lands Issue లేపాక్షి భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న అచ్చెన్నాయుడు - Achchennaidu on Lepakshi lands issue
Achchennaidu on Lepakshi lands అమరావతిలో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ యాగీ చేసి కేసులు పెట్టిన వైకాపా ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 5వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను లేపాక్షిహబ్‌కు కట్టబెట్టిన వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. భూముల అప్పగించ వ్యవహారంలో కీలకంగా ఉన్న అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. జనం కళ్లకు గంతలు కట్టి జగన్ మేనమామ కుమారుడు ఆ భూములు తన్నుకుపోతున్నారని దుయ్యబట్టారు.
‘ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పని చేస్తుందా? లేక సీఎం జగన్ బంధువులు ఆ భూముల్ని ఎగరేసుకుపోతుంటే కళ్లు మూసుకుంటుందా? ప్రజల, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇప్పుడేం చేస్తారు?’ అని మంగళవారం ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘ప్రజా రాజధాని అమరావతి కోసం సమీకరించిన 33వేల ఎకరాల్లో కొద్ది ఎకరాల ఎసైన్డ్ భూములున్నాయని నానా యాగీ చేసి, కేసులు వేసినవారు... లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కి 5వేల ఎకరాల ఎసైన్డ్ భూములు కట్టబెట్టడాన్ని ప్రశ్నించరా? అప్పటి, ఇప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును నిలదీయరా? ప్రభుత్వం నుంచి భూములు కొట్టేసేది వాళ్లే, వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందేది వాళ్లే, నష్టపోయామని దివాలా పిటిషన్ వేసేదీ వాళ్లే, రికవరీ కోసం బ్యాంకులు ఆ భూముల్ని వేలం వేస్తే... తిరిగి అతి తక్కువ ధరకు కొనేసేదీ ఆ ముఠానే.' అని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.
"వైఎస్ హయాం నుంచి ఇప్పటివరకూ లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో దోపిడీ చేయడం ఇది మూడోసారి. అసలు లేని కంపెనీకి భూములు కావాలంటూ, 10వేల ఎకరాల సేకరణకు నాటి సీఎం వైఎస్ హుకుం జారీచేశారు. ఆ తర్వాత ఆ భూముల్ని తమ అనుయాయుల కంపెనీకి రిజిస్టర్ చేశారు. వేల కోట్ల ఎకరాల భూమిని చౌక ధరలకు, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా లేకుండా కట్టబెట్టారు. వారు అక్రమంగా చేసిన మేలుకు బదులుగా నీకిది-నాకది కింద జగన్‌రెడ్డి కంపెనీల్లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. చివరకు అవి జగన్ సొంతమయ్యాయి. ఆ భూములు పొందినవారు వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు రుణం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు వాటిలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో?" - అచ్చెన్నాయుడు, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు