International Telugu Celebrations : తెలుగు భాషను చంపే ప్రయత్నం ఇటీవల జరుగుతోందని, ఇది సబబు కాదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపాన పెదఅమిరంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగును మించిన భాష ప్రపంచంలోనే లేదని ఆయన పేర్కొన్నారు. ‘తెలుగును ఏ తరమైనా చంపేద్దామనుకుంటే.. దాన్ని పరిరక్షించేందుకు మరో తరం ఉవ్వెత్తున పుట్టుకొస్తుంది.
International Telugu Celebrations 2022 : పిల్లలను ఇంట్లో తెలుగులోనే మాట్లాడమనండి. హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామానికి మించి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే వేదికను ఏపీలోనూ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తా’ అని అన్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని సంబరాల్లో పాల్గొన్న మంత్రి శ్రీరంగనాథరాజు వివరించారు. అంతర్జాతీయంగా ఉన్న భాషాభిమానులను, సాహితీ సేవకులను ఓ చోటికి చేర్చిన నిర్వాహకులను అభినందిస్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు.
విశిష్ట ప్రక్రియలకు ఆలవాలం: ఉపరాష్ట్రపతి
తెలుగు భాషకు మరింత వన్నె తెచ్చేలా అంతర్జాతీయ తెలుగు సంబరాలు దోహదపడతాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వేడుకల కోసం ఆయన సందేశం పంపారు. ‘అవధానంలాంటి ఎన్నో అద్భుత ప్రక్రియలున్న ఏకైక భాష మన తెలుగు. విశిష్ట ప్రక్రియలున్న తెలుగుభాషపై భావితరాలకు ఆసక్తి కలిగించాలి’ అని సూచించారు.
సంస్కృతికి ప్రతీకలా సంబరాలు