SC on hyderabad journalists: హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు శుభవార్త వినిపించింది. ఇళ్ల స్థలాల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న హైదరాబాద్ జర్నలిస్టులకు.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ విరమణకు ఒక రోజు ముందు తీపికబురు అందించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు సుప్రీం పచ్చజెండా ఊపింది. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసుపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం విచారించింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. 8 వేల నుంచి 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుకున్నట్టు తెలిపారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తూ తీర్పు వెలువరించారు. వారివారి స్థలాల్లో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో ధర్మాసనం ముందు లిస్టు చేయాలని తెలిపారు.
"ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండి."- జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ