ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో జనసేన, పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. జీవో నంబర్ 42కు వ్యతిరేకంగా విజయవాడ వన్ టౌన్ పరిధి కొత్తపేటలోని ఎస్‌కేపీవీ హిందూ హై స్కూల్ ముందు ఆందోళన చేపడుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిఘటించిన విద్యార్థులు పోలీసుల వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో అదుపులోకి తీసుకున్న నాయకులను పోలీసులు వదిలేశారు. దీంతో విద్యార్థులు శాంతించారు.
జీవో నంబర్ 42ను వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులతో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయవాడ వన్ టౌన్ పరిధిలో సుమారు 10 వేల మంది పిల్లలు ఎయిడెడ్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.. ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నందున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.