తెలంగాణ

telangana

ETV Bharat / city

World Environment Day : పర్యావరణాన్ని రక్షిస్తాం.. భూమాత రుణాన్ని తీర్చుకుంటాం

పర్యావరణ పరిరక్షణ అంటే శాస్త్రవేత్తలో, మేధావులో మాత్రమే ఆలోచించాల్సింది కాదు... అది ప్రతి ఒక్కరి బాధ్యత... ప్రతి ఇంటా జరగాల్సిన పవిత్ర కార్యక్రమం... అంటున్నారు కొందరు అమ్మాయిలు. అనడమే కాదు తమవంతుగా భూమాత రుణాన్ని తీర్చుకునేందుకు కృషిచేస్తున్నారు.

By

Published : Jun 5, 2021, 7:22 AM IST

environmental day, environmental activists
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం, పర్యావరణ కార్యకర్తలు

ఐరాస ప్రచారకర్తగా పర్యావరణాన్ని, పచ్చదనాన్ని కాపాడమని అందరికీ చెప్పడమే కాదు... ఆచరించి చూపిస్తోంది ప్రముఖ నటి, మోడల్‌ దియా... ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యాపారవేత్త, బ్యాంకింగ్‌ ఇన్వెస్టర్‌ వైభవ్‌రేఖిని దియామీర్జా వివాహం చేసుకుంది. వేడుకలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉపయోగించలేదు. తమ ఇంటి పెరట్లోని మామిడి చెట్టునే పెళ్లి మంటపంగా మార్చుకుంది. దియా ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న జీరోవేస్ట్‌ పద్ధతినే పెళ్లిలోనూ కొనసాగించింది.

‘చిన్న వయసులోనే మోడలింగ్‌లో అడుగుపెట్టడంతో.. సంపాదన త్వరగానే మొదలయ్యింది. దాంతో... ఆలస్యం చేస్తే కొనడానికి ఇంకేమీ మిగలవేమో అన్నంతగా షాపింగ్‌ చేసేదాన్ని. కానీ ఒక జత జీన్స్‌ తయారీకి కొన్ని వేల లీటర్ల నీటిని ఉపయోగిస్తారని తెలిశాక నా షాపింగ్‌ అలవాటే మారిపోయింది. మేకప్‌ ఉత్పత్తులు సైతం... పర్యావరణహితమైనవే కొనడం మొదలుపెట్టాను. ఎక్కడికి వెళ్లినా మెటల్‌ బాటిల్‌ తీసుకెళతాను. ప్లాస్టిక్‌ బాటిళ్లను కొనను. ప్లాస్టిక్‌ని ఇంట్లోకి తీసుకురావద్దని మా ఇంట్లో అందరికీ... పనివాళ్లకి కూడా ఖరాఖండీగా చెప్పేశా. కొన్ని రోజులకి నెమ్మదిగా ప్లాస్టిక్‌ వినియోగం తగ్గిపోయింది. ఇక కరెంట్‌. మా ఇంట్లో సంగతి పక్కనపెట్టండి... మా సొసైటీ కరెంటు బిల్లు అంతా కలిపినా రూ.ఐదువేలు దాటదు. మా అపార్ట్‌మెంటులో ఎవరికి కరెంట్‌ బిల్లు తక్కువ వస్తే వాళ్లకి ఒక గిఫ్ట్‌ ఇస్తాం మరి! మా ఇంట్లో నుంచి వచ్చే చెత్తనూ వృథా చేయను. మొక్కలకు ఎరువుగా మారుస్తాను. ఇదంతా చూసి దియా దగ్గర డబ్బుల్లేవేమో అన్న వాళ్లూ ఉన్నారు. మనం ఆలోచించాల్సింది డబ్బు గురించి కాదు, పర్యావరణం గురించి. ఇప్పటివరకూ పర్యావరణానికి చేసిన హాని చాలు. పరిస్థితి చేయిదాటకుండా ఉండాలంటే మనకున్న సమయం చాలా తక్కువ. విలువైన సహజ వనరులని కాపాడుకుందాం’ అనే దియా ఐక్యరాజ్యసమితి తరఫున ఎన్నో పర్యావరణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

రెండుసార్లు ఐరాస పర్యావరణ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపికైన ఈ హైదరాబాదీ అమ్మాయి... సముద్రాల్లో వ్యర్థాలపై చైతన్యం కోసం ముంబయిలోని బీచ్‌ క్లీనింగ్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తూ ఉంటుంది. ఏనుగుల సంరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఎంత డబ్బు ఇచ్చినా పర్యావరణ హిత ఫ్యాషన్‌ బ్రాండ్‌లకు మాత్రమే మోడల్‌గా వ్యవహరిస్తోంది. ఈ విషయాలపై పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉంటుంది. బ్లాగులూ నిర్వహిస్తోంది. అంతేకాదు... అంతర్జాతీయ వేదికలపై భారతవాణిని బలంగా వినిపిస్తోంది.

అడవి కథలు చెప్పే డాక్టర్‌!

నోరు తెరిచి మాట్లాడని వాళ్లని మొద్దు అని తేలిగ్గా అనేస్తాం కానీ అడవిలో మానులు, మొద్దులు ఎన్ని కథలు చెబుతాయో తెలుసా? చెట్టు ఒంటరి కాదు... అది పుట్టిపెరిగే క్రమంలో కనిపించని, కనిపించే ఎన్నో జీవజాతులకు నీడనీ, ఆవాసాన్నీ ఇస్తుంది. వినే మనసుంటే అడవులు చెప్పే కథలు ఎన్నో అంటుంది ఎకాలజిస్టు డాక్టర్‌ మేఘనా కృష్ణదాస్‌. సైంటిస్టుగా తాను కనిపెట్టిన అనేక విషయాలని పరిశోధనా పత్రాలకే పరిమితం చేయకుండా గోతేజంత్రమ్‌ వంటి వేదికలపై పిల్లలకు, పెద్దలకు అర్థమయ్యేలా తరగతులు చెబుతుంది. మానవ నిర్మిత అడవులు కాకుండా ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పరిచిన అడవుల్లోని జీవవైవిధ్యం, పర్యావరణ రక్షణ దిశగా తన పరిశోధనలు సాగుతున్నాయి.

'నేను పెరిగింది కోల్‌కతా, బెంగళూరుల్లో. అమ్మ ఉపాధ్యాయురాలు. నాన్న జీఎస్‌ఐలో పనిచేస్తారు. ఎక్కువగా ప్రకృతిలో గడిపేందుకు ఇష్టపడేదాన్ని. ఇంట్లో ఉంటే టీవీలో వన్యప్రాణుల డాక్యుమెంటరీలు చూసేదాన్ని. పాఠశాలలో జీవశాస్త్రం అంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. కెరీర్‌ పరంగా ఇందులో పెద్దగా అవకాశాలు లేవని మా అమ్మానాన్న వైద్యవిద్యలో చేర్చారు. బెంగళూరు వైద్యకళాశాలలో 2006లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాను. సిటీలోని ఆసుపత్రుల్లో పనిచేయడం ఇష్టం లేదు. అందుకే వైద్యసేవలు అందని ప్రాంతాల్లో గిరిజనులు, గ్రామీణులకు రెండేళ్లు సేవలు అందించాను. కర్ణాటక, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్‌లో స్వచ్ఛంద, ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వర్తించాను. ఈ క్రమంలో ప్రకృతికి మరింత దగ్గరయ్యాను.'

- డాక్టర్‌ మేఘనా కృష్ణదాస్‌, ఎకాలజిస్టు

మలుపు తిప్పింది..

ఒకసారి పులుల అభయారణ్యానికి వెెళ్లాను. అదే నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ఊహించలేదు. క్షేత్రస్థాయి అధ్యయనానికి సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ స్టడీస్‌లో వాలంటీర్‌గా అవకాశం రావడంతో పశ్చిమ కనుమల్లో పులుల పర్యవేక్షణ ప్రాజెక్ట్‌లో చేరా. అడవుల్లో సురక్షితంగా సంచరించడం మొదలు, వన్యప్రాణుల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ప్రకృతిని అధ్యయనం చేయడం కూడా ఒక శాస్త్రమే అని అర్థమైంది. ప్రజావైౖద్యమా? పర్యావరణ పరిశోధనా? అన్నప్పుడు రెండోదానివైపు మొగ్గుచూపాను. నా స్నేహితురాలి ప్రోద్బలంతో జాతీయ జీవశాస్త్ర పరిశోధన సంస్థ(ఎన్‌సీబీఎస్‌)లో మాస్టర్స్‌లో చేరా. అంతకుముందు నేను అరుణాచల్‌ ప్రదేశ్‌లో టైగర్‌ రిజర్వ్‌లో పనిచేయడం మాస్టర్స్‌కు ఉపకరించింది. మాస్టర్స్‌ కాగానే యూఎస్‌ఏలోని యాలె విశ్వవిద్యాలయంలో అడవులు- పర్యావరణంపై పీహెచ్‌డీ చేశాను. వైద్య వృత్తిని వదులుకున్నందుకు ఇంట్లో మొదట వ్యతిరేకత వచ్చినా తర్వాత సర్దుకుంది. ప్రస్తుతం నేను సీసీఎంబీకి అనుబంధంగా ఉన్న అంతరించిపోతున్న జంతుజాతుల పరిరక్షణ ప్రయోగశాల(లాకోన్స్‌)లో పర్యావరణ పరిశోధకురాలిని. దేశంలోనే ప్రతిష్ఠాత్మక ప్రయోగశాల కావడంతో రెండేళ్ల క్రితం ఇక్కడ చేరాను. శాస్త్రవేత్తగా విద్యార్థులకు ఈ విషయాలను చెప్పడానికి, ఎప్పటికప్పుడు వారితో ఆలోచనలు పంచుకోవడం చాలా బాగుంటుంది.

వ్యర్థానికి అర్థం చెబుతూ..

ఓ టీవీ కార్యక్రమం ఆ ఇంజినీరింగ్‌ అమ్మాయిలో పర్యావరణంపై ఆలోచనల్ని రేకెత్తించింది. ఆ తర్వాత చేసిన ఫెలోషిప్‌లు ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేలా పురిగొల్పాయి. ఆమే కావ్య సింధూజ...

మాది విజయవాడ. వ్యాపార కుటుంబం. హైదరాబాద్‌ బిట్స్‌లో ఇంజినీరింగ్‌ చేసి, ముంబయిలో ఉద్యోగంలో చేరా. ఆమిర్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సత్యమేవ జయతే’ చూసేదాన్ని. అందులో వ్యర్థాల పునర్వినియోగం ఎపిసోడ్‌ నాపై ప్రభావం చూపింది. దాని అధ్యయనంలో భాగంగానే ఉద్యోగం చేస్తూనే 2016లో అశోకా విశ్వవిద్యాలయం నుంచి ‘యంగ్‌ ఇండియా’ ఫెలోషిప్‌కి ఎంపికయ్యా. తరగతుల్లో భాగంగా దిల్లీ నుంచి వచ్చే మార్గంలో ఓ ఎత్తైన ప్రాంతం కనిపించేది. అదో కొండ అనుకొన్నా. తర్వాత తెలిసింది డంప్‌యార్డ్‌ అని. అక్కడి వారితో మాట్లాడా. చెత్త దిబ్బ నుంచి వచ్చే దుర్వాసన కారణంగా వారు అనారోగ్య పాలవడమే కాకుండా భూగర్భ జలాలూ కలుషితమవుతున్నాయని తెలిసింది. ముగ్గురు సభ్యులతో కూడిన మా బృందం ఆ డంపింగ్‌ యార్డు అంశాన్నే ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుంది. ఇవన్నీ చూశాక ఇళ్ల నుంచి వెలువడే చెత్తను తగ్గించేందుకు కృషిచేయాలని నిశ్చయించుకున్నా. ఫెలోషిప్‌ పూర్తయ్యాక మా వ్యాపారం చూసుకోవడం ప్రారంభించా. మరోవైౖపు ఇంటి వ్యర్థాల పునర్వినియోగంపై సమాచారాన్ని సేకరించి, ప్రయోగాలు చేశా. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేదిశగా నా అలవాట్లనూ మార్చుకున్నా. ‘పర్యావరణహితంగా జీవించడం’ అంశంపై బెంగళూరు భూమి కళాశాలలో ఫెలోషిప్‌ విషయం తెలిసి దరఖాస్తు చేశా. ఇవన్నీ మా ఇంట్లో వాళ్లకి నచ్చలేదు. అయిష్టంగానే ఒప్పుకొన్నారు.

ఎర్త్‌ సిట్టర్స్‌... ఫెలోషిప్‌లో భాగంగా ‘వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’పై ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆరు నెలలు పనిచేశా. అప్పుడే తొలిసారిగా వర్క్‌షాపులు నిర్వహించా. ఏడాది తర్వాత విజయవాడకు వచ్చి.. వ్యర్థాలకు అర్థాన్నిచ్చేలా, ప్రకృతికి హాని తలపెట్టకుండా జీవించడంపై ఓ రూట్‌మ్యాప్‌ రూపొందించా. గత ఫిబ్రవరిలో ‘ఎర్త్‌ సిట్టర్స్‌’ ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించా. ఇంటి వ్యర్థాలే ఎరువుగా టెర్రస్‌ గార్డెనింగ్‌ చేస్తున్నా. మాకు అవసరమయ్యే వాటిలో 80 శాతం ప్రకృతిసిద్ధంగా పండిస్తున్నా. అప్పుడే రైతుల కష్టం తెలిసింది.

పాఠాలతో అవగాహన కల్పిస్తూ.. విజయవాడలో కొన్ని స్కూళ్లు, కాలేజీల్లో ‘వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’పై తరగతులు బోధించా. లాక్‌డౌన్‌ వల్ల ఆన్‌లైన్‌ వేదికగా తరగతులు ప్రారంభించా. వారానికి రెండు గంటల చొప్పున నాలుగు వారాల కోర్సు ఇది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవసరం, పర్యావరణహితంగా జీవించడం తదితర అంశాలను వివరిస్తా. ఇప్పుడు రెండు బ్యాచ్‌లు నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక.. విద్య, కార్పొరేట్‌ సంస్థల్లో సెషన్స్‌ నిర్వహించబోతున్నా. ఉచితంగా అంటే విన్నా పాటించరేమోననే ఉద్దేశంతోనే నామమాత్ర ఫీజును పెట్టా. ప్రకృతికి హాని చేసేది ఏదైనా మానవాళికీ ముప్పే. చికిత్స కన్నా నివారణే నయం అన్న సూత్రాన్ని పాటిస్తే భవిష్యత్తు తరాలైనా బాగుంటాయి. ఎవరి పరిధిలో వారు పర్యావరణహితంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయాలను పాఠ్యాంశాల్లో చేరిస్తే అందరికీ దీనిపై అవగాహన వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details