తెలంగాణ

telangana

ETV Bharat / city

VIZAG STEEL PLANT: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు, రేపు దిల్లీలో నిరసనలు - విశాఖ స్టీల్ ప్లాంట్ తాజా వార్తలు

దిల్లీ వీధుల్లో ఉక్కు ఉద్యమ నినాదాలు వినిపించేందుకు కార్మికులు, నిర్వాసితులు సిద్ధమయ్యారు. ఏపీలోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు, రేపు.. జంతర్‌మంతర్‌, ఆంధ్ర భవన్‌ వద్ద నిర్వహించబోయే మహా నిరసనకు వైకాపా, తెలుగుదేశం, వామపక్షాలు సహా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. విశాఖ నుంచి వాయు, రైలు మార్గాల్లో దిల్లీకి చేరుకున్న కార్మికులు, నేతలు జంతర్‌మంతర్‌ వైపుగా అడుగులు వేస్తున్నారు.

దిల్లీలో ఉక్కు ఉద్యమ కార్మికులు.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు, రేపు నిరసనలు
దిల్లీలో ఉక్కు ఉద్యమ కార్మికులు.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు, రేపు నిరసనలు

By

Published : Aug 2, 2021, 7:17 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. 170 రోజులుగా కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు కేంద్రం స్పందించకపోవటంతో.. తాడోపేడో తేల్చుకోవటమే లక్ష్యంగా ఉక్కు ఉద్యమ పోరాట సమితి అడుగులు వేసింది. పార్లమెంట్‌ ఉభయ సభలు జరుగుతున్న సమయంలోనే దిల్లీలో ఉద్యమవాణి వినిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడు జంతర్‌మంతర్‌ వద్ద... రేపు ఆంధ్ర భవన్‌లో మహా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నిన్న విశాఖ నుంచి బయలుదేరి దిల్లీకి చేరుకున్న ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట సమితి నేతలు, కార్మికులు... దేశ రాజధాని వీధుల్లో ఉక్కు నినాదాలు మారుమోగించాలని నిర్ణయించుకున్నారు.

అన్ని వర్గాల సంఘీభావం..

ఉక్కు ఉద్యమానికి వైకాపా, తెలుగుదేశం, వామపక్షాలు సహా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. దిల్లీలో కార్మికులు చేయబోయే ఉద్యమంలోనూ పాల్గొనేందుకు పలు పార్టీల నేతలు రాబోతున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో పలు పార్టీలకు చెందిన నేతలు ఉక్కు ఉద్యమంపై గళాన్ని వినిపిస్తారని వెల్లడించారు. పార్లమెంట్‌, కోర్టులో ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా కేంద్రం ప్రకటన చేస్తోందని తెలిపారు. ఇకపై పోరాటాన్ని ఉద్యమం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు.

దిల్లీకి పయనం..

కార్మికులతో పాటే వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు, విశాఖ డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు తదితర నేతలు దిల్లీకి వెళ్లారు. ప్రైవేటీకరణ ఆపేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నప్పటికీ.. కేంద్రం మొండిగా ముందుకెళ్తోందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. దిల్లీలో రెండు రోజుల పాటు జరగబోయే ఉద్యమంలో తాము భాగస్వాములవుతామని తెలిపారు.

ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం ఒక ఎత్తు.. ఇకపై జరగబోయే పోరాటం మరో ఎత్తు అని కార్మికులు చెబుతున్నారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు.

ఇదీ చదవండి:Nagarjuna Sagar Dam: 22క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details