AP Employees Association Strike : పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఒంగోలులో రెండో రోజు దీక్షలను ఏపీ ఎన్జీవో సంఘం ఆ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రారంభించారు. 200 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు దీక్షలో కూర్చున్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలి, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలి, పాత జీతాలు ఇవ్వాలన్న తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
కర్నూలులో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు పాల్గొన్నారు. పీఆర్సీ చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పట్టింపులకు పోకుండా పాత జీతాలు ఇవ్వండి: బొప్పరాజు
ఉద్యోగులు.. తమకు జరిగిన ఇబ్బందులపై రోడ్డెక్కి పోరాడుతున్నారు. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట రెండో రోజు కొనసాగుతున్న పీఆర్సీ సాధన సమితి రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని దద్దరిల్లేలా చేపెట్టాలన్నారు. తాము చిత్తశుద్ది, నిజాయితీతో ఉన్నామని.. పదేపదే ప్రభుత్వం చుట్టు తిరిగిన పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేదని పేర్కొన్నారు. పోరాటమే శరణ్యమని తలచి ఉద్యమిస్తున్నామన్నారు. పీఆర్సీ నివేదిక ఎందుకు దాచి పెడుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే నివేదిక బయటపెట్టాలన్నారు. ఉద్యోగుల మద్య ఘర్షణ వాతావరణం సృష్టించవద్దని ఐఏఎస్ అధికారులను కోరారు.
ఆలస్యమైతే ఉద్యమం తీవ్రతరం: సూర్యనారాయణ
నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ అన్నారు. ఆలస్యమైతే ఉద్యమం తీవ్రమవుతుందని హెచ్చరించారు. గతంలో చాలాసార్లు చర్చలకు పిలిచారని.. ఎప్పుడూ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.