తెలంగాణ

telangana

ETV Bharat / city

Krishna water: కృష్ణా జలాలపై సుప్రీంకు ఏపీ  ప్రభుత్వం!

కృష్ణా జలాలపై సుప్రీంకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరనుంది. నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని విజ్ఞప్తి చేయనుంది. కేఆర్​ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరనుంది. రైతులు, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది.

Krishna water
Krishna water

By

Published : Jul 13, 2021, 5:20 AM IST

Updated : Jul 13, 2021, 11:12 AM IST

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వైఖరిని నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. రిట్ పిటిషన్ దాఖలుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. విచారణలో ప్రస్తావించాల్సిన అంశాలపై సాగునీటిశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దేశంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సర్వసాధారణమైపోయాయని.. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను జాతీయ ఆస్తులుగా గుర్తించి నిర్వహణ, భద్రత బాధ్యతను కేంద్రానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసే అవకాశమున్నట్టు తెలిసింది. వివిధ నదుల్లో నీటి వాటాలను ట్రైబ్యునళ్లు, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయని.. వాటి కచ్చితమైన అమలుకు ఇది అవసరమని అధికారులు అంటున్నారు. నిర్దేశిత వాటాను మీరడం, ఒప్పందాలు ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ఉన్నవాటి విస్తరణ వంటివి ఆపాలంటే ఓ శాశ్వత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టు సమాచారం. రాజ్యాంగం ప్రకారం.. నదీజలాల వివాదం పరిష్కరించాల్సింది కేంద్రమే కాబట్టి.. వాటిపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలూ కేంద్రం పరిధిలోనే ఉండాలని పిటిషన్‌ ద్వారా ఏపీ కోరనున్నట్టు తెలుస్తోంది.

సుప్రీంను ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం లేదు..

బచావత్ అవార్డు ప్రకారం తాగు, సాగునీటి అవసరాలే తొలి ప్రాధాన్యత అని.... సాగుకు నీరు విడుదల చేసినప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని.. ప్రత్యేకంగా ఉత్పత్తికే విడుదల చేయరాదన్న విషయాన్ని సుప్రీం ఎదుట ఏపీ ప్రస్తావించనున్నట్టు సమాచారం. నదికి దిగువన ఉన్న ప్రాంత అవసరాలతో నిమిత్తం లేకుండా.. పై ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలు లేకుండానే విద్యుదుత్పత్తి కోసమే నీళ్లను విడిచిపెట్టడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్న వాదననూ ఏపీ బలంగా వినిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యల వల్ల లక్షలాది రైతుల సాగుకు విఘాతం కలుగుతోందని.... దేశ ఆహార భద్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని వ్యాజ్యంలో పొందుపరచనున్నారని సమాచారం. చట్టబద్ధ బచావత్ విధానానికి విరుద్ధంగా ఒప్పందాలను యథేచ్చగా ఉల్లంఘిస్తూ, ఎలాంటి చట్టాలు తమకు వర్తించవన్నట్టు వ్యవహరిస్తున్నప్పుడు సుప్రీంను ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వ్యాజ్యం ద్వారా వివరణ..!

పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయాన్ని వ్యాజ్యం ద్వారా వివరించనున్నట్టు ఏపీ సాగునీటిశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టులను కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటే పక్షపాతం లేకుండా వ్యవహరించే అవకాశం ఉంటుందన్న వాదనను పొందుపరుస్తున్నట్టుగా సమాచారం. ఉభయరాష్ట్రాల సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణాన్ని తొలగించాల్సిన అవసరముందన్న విషయాన్నీ ప్రస్తావించినున్నట్టు తెలుస్తోంది. ఉల్లంఘనలు నిలిపివేయాలంటూ సంబంధిత అధీకృత సంస్థలు ఆదేశాలిచ్చినా తెలంగాణ పాటించని విషయాన్ని వ్యాజ్యంలో పేర్కొనబోతున్నట్టు సమాచారం. కేఆర్​ఎంబీ విధివిధానాల ఖరారు ప్రక్రియలోనూ తెలంగాణ వైఖరిని సుప్రీం ఎదుట నివేదించనున్నట్టు తెలుస్తోంది. విధివిధానాల ఖరారుతో పాటు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే సస్పెండ్ చేయాలని కోరనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి:ts cabinet meeting: ఉద్యోగాల భర్తీ ఆమోదమే ప్రధాన అజెండా

Last Updated : Jul 13, 2021, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details