దాదాపుగా.. ఇది మీరు ఎక్కడా విని ఉండని క్రైమ్ స్టోరీ! కొంత ఆందోళన.. మరెంతో ఉత్కంఠ రేకెత్తించే రియల్ స్టోరీ! కాబట్టి.. మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. కథలోకి వెళ్తే.. అమెరికాలోని న్యూ హాంప్ షైర్ రాష్ట్రం. ఓ మహిళ తన ఇంట్లో ఉంటోంది. రోజూ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేది. తలుపులకు పకడ్బందీగా తాళం వేసి మరీ వెళ్లేది. కానీ.. ఆమె బయటకు వెళ్లిన తర్వాత.. 20 ఏళ్ల కుర్రాడు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించేవాడు. కానీ ఎలాంటి చోరీ చేసేవాడు కాదు. ఇంట్లోనే ఉండేవాడు. టీవీ చూసేవాడు. ఇళ్లంతా తిరిగేవాడు. ఇక, ఆఫీస్ నుంచి ఆమె వచ్చేలోపు ఇంట్లో ఓ ప్రాంతానికి వెళ్లిపోయేవాడు. రాత్రంతా అక్కడే ఉండేవాడు. ఆమె.. తన పనులన్నీ చేసుకుంటున్నప్పుడు.. ఇంట్లోనే ఉండి గమనించేవాడు. కానీ.. ఏ మాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేసేవాడు. రాత్రి అక్కడే నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఆమె ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత.. బయటకు వచ్చేవాడు. మళ్లీ అవసరం అనుకుంటే.. సాయంత్రంలోపు ఇంట్లో దూరిపోయేవాడు. లేదంటే.. మరుసటి రోజు వెళ్లేవాడు. ఇంతకీ ఎవరతను..? అసలు అక్కడ ఏం చేస్తున్నాడు?
అతనొక "ప్రేమికుడు". ఆమెను ఎక్కడ చూశాడో.. చూశాడు. కొన్ని నెలల నుంచి ఆమెను ఫాలో అవుతున్నాడు. కానీ.. ఆమె గుర్తించలేదు. కొంత కాలం తర్వాత మొత్తానికి ఎదురు పడ్డాడు. తనను పర్సనల్ గా కలవాలని, తనతో డేటింగ్ చేయాలని అడిగాడు. కానీ.. ఆమె "నో" చెప్పింది. అతను వినిపించుకోలేదు. అలాగే వెంటాడుతున్నాడు. పలుమార్లు గట్టిగా చెప్పింది. అయినా.. పద్ధతి మార్చుకోలేదు. దొంగ చాటుగా ఆమెను ఫాలో కావడం మొదలు పెట్టాడు.
ఓ సారి.. న్యూ హాంప్‌షైర్‌కు 400 మైళ్ల దూరంలో ఉన్న ఓ పట్టణానికి వెళ్లింది సదరు మహిళ. ఆ రోడ్ సైడ్ రోమియో.. అక్కడికి కూడా వెళ్లిపోయాడు. అది చూసిన మహిళ అవాక్కైంది. ఎలా వచ్చాడో తెలుకొని మరింత ఆశ్చర్యపోయింది. ఆమె కారు డిక్కీలో పడుకొని వచ్చేశాడు మరి!! కోపగించుకున్న మహిళ.. ఇది సరైన పద్ధతి కాదని, తనను వేధించడం మానుకోవాలని సూచించింది. ఓసారి.. ఆమె తన తల్లి ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు వీడియో కాల్ చేశాడు. విసుగ్గా ఫోన్ ఎత్తిన ఆమె.. అతన్ని చూసి నిర్ఘాంతపోయింది. అతను ఉన్న లొకేషన్ ఎక్కడిదోకాదు.. వాళ్ల అమ్మ ఇంటి వద్దనే! అడ్రస్ ఎలా తెలుసుకున్నాడో తెలియదు.. అక్కడికి కూడా వెళ్లిపోయాడు! అక్కడ అతన్ని చూసి హడలిపోయింది సదరు మహిళ. ఇలాంటి పనులు తనకు నచ్చవని.. వెంటనే వెళ్లిపోవాలని చెప్పి, పంపించింది. కానీ.. కొన్ని గంటల తర్వాత ఊహించని షాక్.. మహిళ వాళ్ల అమ్మ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యాడు!
ఆ తర్వాత.. ఆమె తిరిగి న్యూ హాంప్ షైర్ కు వెళ్లిపోయింది. ఆశ్చర్యంగా.. కొన్ని రోజులుగా ఆ "శాడిస్టు ప్రేమికుడు" ఆమెకు కనిపించట్లేదు. ఓ గొడవ వదిలిపోయిందిలే అని ఆమె ప్రశాంతంగా ఆఫీసుకు వెళ్లి వస్తోంది. కానీ.. వాడు ఏకంగా ఆమె ఇంట్లోనే ఉండటం మొదలు పెట్టాడు. ఈ విషయం తను గుర్తించలేకపోయింది! ప్రేమ గోల లేకుండా ఉన్నానని ఆమె.. ప్రేమికురాలి ఇంట్లోనే ఉంటున్నానని వీడు.. ఇద్దరూ ప్రశాంతంగా కాలం గడిపేస్తున్నారు.