కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయను డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి కలిశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా తీరుతెన్నులపై చర్చించారు. దేశీయంగా తయారుచేసిన స్పుత్నిక్-వీ(Sputnik-V ) వ్యాక్సిన్‌ను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చర్యలు వేగవంతం చేసింది. గతనెల మేలో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను దేశంలో సాఫ్ట్ లాంఛ్ చేసిన డాక్టర్ రెడ్డీస్.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ డోసులను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(RDIF) నుంచి దిగుమతి చేసుకుంటూ దేశంలో సరఫరా చేస్తూ వస్తోంది.
వచ్చే సెప్టెంబర్ నెల నుంచి దేశీయంగానే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని కేంద్రమంత్రికి కంపెనీ ఛైర్మన్ సతీష్ రెడ్డి గుర్తు చేశారు. ఉత్పత్తి, సరఫరాపై ప్రణాళికలను పంచుకున్నారు. దేశీయంగా స్పుత్నిక్(Sputnik-V ) వ్యాక్సిన్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌తో పాటు.. ఆరు డ్రగ్ కంపెనీలతో ఈమేరకు ఆర్‌డీఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ డోసుల దిగుమతి, సొంత ఉత్పత్తి ద్వారా 250 మిలియన్ స్పుత్నిక్ -వీ డోసులను దేశంలో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నిస్తోంది.