తెలంగాణ

telangana

ETV Bharat / city

రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి.. - రాఖీ

నాన్న బాధ్యతలు సగానికి సగం తగ్గించేస్తాడు అన్న. ఆడబిడ్డల విషయంలో అమ్మ ఆరాటాన్ని.. తీర్చేస్తాడు తమ్ముడు. ఈ ఇద్దరూ తోబుట్టువులకు అండాదండా! ఈ ఇద్దరికీ ఆ ఆడపడుచుల ఆనందమే నికర లాభం. అందుకే వీరిద్దరూ ఒకరికొకరు రక్ష. ఈ అనుబంధం ఇంటికే పరిమితం కాకుండా.. సమాజానికీ ఉపయోగపడాలి. వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

rakhi
rakhi

By

Published : Aug 3, 2020, 8:39 AM IST

మా అన్నకు చెప్తా! ఓ చెల్లెలి ధైర్యం.

మా తమ్ముడొస్తాడు!! ఓ అక్క అస్త్రం.

నాన్నంటే భయం. అమ్మ దగ్గర చెప్పలేని విషయం. వెంటనే గుర్తొచ్చే బాంధవుడు అన్న. తనకు చెప్పుకొంటే.. అన్నీ చూసుకుంటాడనే భరోసా! అన్నకూ ఎన్నిసార్లు నాన్న నుంచి రక్షణ కల్పించిందో ఆ చెల్లెలు. ఈ విషయంలో ఇద్దరూ తోడుదొంగలే! ఇదే సూత్రం అక్కాతమ్ముళ్లకూ వర్తిస్తుంది. అయితే, ఆడబిడ్డల దగ్గర చిన్న లాజిక్కు ఉంటుంది. అది అందరు అన్నాదమ్ములకు తెలిసిందే! అయినా.. తమకే ఇబ్బంది వచ్చినా ముందుగా సోదరితో పంచుకుంటారు. రహస్యమైతే ఎవరికీ చెప్పొద్దు. ముఖ్యంగా అమ్మానాన్నకు తెలియనివ్వకూ అంటారు. అప్పుడా సోదరి ‘నా మీదొట్టు చెప్పను’ అంటుంది.

రెండు రోజులయ్యాక.. ‘ఏరా! జాగ్రత్తగా ఉండు. ఏమైనా ఇబ్బందుంటే నాతో చెప్పు’ అంటాడు ఆఫీస్‌కు వెళ్తున్న నాన్న. అన్నం పెడుతూ.. ‘వాళ్లతో స్నేహం చేయొద్దంటే వినవు...’ అని నిష్ఠూరాలాడుతుంది అమ్మ. రెండు రోజుల కిందట తోబుట్టువుకు చెప్పిన రహస్యం అమ్మానాన్నలకు తెలిసిపోయిందన్నమాట! తన మీద వేసుకున్న ఒట్టును గట్టుమీద పెట్టి మరీ.. రహస్యాన్ని బట్టబయలు చేస్తుంది సోదరి. ఎందుకు? తన అన్న గాడి తప్పుతున్నాడేమో అని భయం ఆమెకు. లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటున్నాడేమో అనే ఆత్రుతతో... అతడి మేలుగోరి మాట తప్పుతుంది. ఏం చేసినా తోడబుట్టిన వాడి మంచికే చేస్తుంది! ఇలాంటి దృశ్యాలు అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఉన్న ప్రతి ఇంట్లో కనిపించేవే!

కంటికి కనిపించని దృశ్యాలు కొన్ని ఉంటాయి. ఊహకు అందని సమస్యలూ ఉంటాయి. అవేంటో తెలుసుకొని.. తేల్చేయడమే ఈ తరం సోదరి అన్నకిచ్చే రక్షాబంధన్‌ రాఖీ. ఇంట్లో అక్క ఆనందం కోసం ఆరాటపడే అన్న.. మరొకరి చెల్లి విషయంలో మాత్రం పరిధులు దాటి ప్రవర్తిస్తుంటాడు. ఆ చెల్లికి అన్న ఉండకపోవచ్చు. తమ్ముడూ ఉండకపోవచ్చు. ఉన్నా.. ఈ వికృత విషయాలు చెప్పుకోలేకపోవచ్చు. దారివెంట వికారపు మాటలు, విచ్చలవిడి చేష్టలు! వాట్సాప్‌ తెరిస్తే.. వెకిలి నవ్వులు!! గడపదాటిన ఆడపిల్ల అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. సోషల్‌ మీడియాలోకి వచ్చి పద్మవ్యూహంలో ఇరుక్కుంటోంది. ఈ అనవసరమైన సందేశాలు పంపే పిరికివాళ్లు మీ అన్నలే అయి ఉండొచ్చు. మీ తమ్ముళ్లూ కావొచ్చు.

ప్రతిసోదరీ రక్షాబంధనం కట్టిన తర్వాత తోచినంత కట్నం ముట్టజెబుతున్న సోదరుడిని వారించి.. ఓ మాటివ్వమనండి. ‘అన్నా! నీ వల్ల ఏ ఆడకూతురూ కన్నీళ్లు పెట్టుకోవద్ద’ని కోరండి. ‘పరాయి స్త్రీతో మర్యాదగా నడుచుకుంటామ’ని మాటివ్వమనండి. ఈ ఒట్టుకు ఒక్క అన్న కట్టుబడినా.. ఓ సోదరి జీవితం దుర్భరం కాదు. ఈ ప్రమాణానికి ఒక్క తమ్ముడు నిలబడినా మరోసోదరి బతుకు బుగ్గిపాలవ్వదు. సోదరీమణులారా!! ఈ మాట ఇస్తేనే రాఖీ కడతామని చెప్పండి. అప్పుడే సోదరుడి నోరు తీపి చేయండి. రక్షాబంధన్‌ సందర్భంగా సాటి ఆడపిల్లల జీవితాలకు రక్షణ కల్పించండి.

ABOUT THE AUTHOR

...view details