kodi pandalu in Andhra pradesh:సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందేలు. తెలుగు సంప్రదాయం, పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడిపందేలను పండుగ జరిగే మూడురోజులు కోలాహలంగా నిర్వహిస్తారు. సంక్రాంతికి 6 నెలల ముందు నుంచే ఈ పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. కోళ్లను పందేనికి సిద్ధం చేసే క్రమంలో ఎంతో శ్రమ, కఠిన శిక్షణ ఉంటుంది. బలవర్ధకమైన ఆహారం అందించడంతో పాటు తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్ మాత్రలు వేస్తారు. ఒక్కో కోడి పుంజుకు సుమారు రూ.10వేల నుంచి 30వేల వరకు ఖర్చు చేస్తారు.
ఆ రెండు అంశాలే కీలకమైనవి...
కోడి పందెంలో రెండు అంశాలు కీలకమైనవి. ఒకటి కోడి జాతి, రెండు దానికి ఇచ్చే శిక్షణ. కోడి పుంజుల్లో తెల్ల నెమలి, కోడి నెమలి, గౌడ నెమలి, కాకి డేగ, నెమలి కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్, ఎర్ర డేగ వంటి జాతులు ఉంటాయి. రెక్కల రంగు, ఇతర శారీరక లక్షణాల ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. ముందుగానే వీటిని ఎంపికు చేసుకుని.. ఏడాదిన్నర పాటు శిక్షణ ఇచ్చి పందెం బరిలోకి దింపుతారు.
ఏ దిక్కు నుంచి కోడిని బరిలోకి దించాలి...
కోడిని ఏ దిక్కు నుంచి బరిలోకి దింపితే విజయం సాధిస్తుందనే అంశంలో పందెం రాయుళ్లు కొన్ని విశ్వాసాలను అనుసరిస్తారు. వారాలు, పక్షాలను అనుసరించి.. కొన్ని జాతుల కోడి పుంజుల జీర్ణశక్తి మందగిస్తుందన్న అంచనా కూడా ఉంది. ఆ సమయంలో పందేనికి దింపితే కోడి అపజయం పాలవుతుందని కొందరు నమ్ముతారు.
ఆ జాతి కోళ్లు పోరాట పటిమకు పెట్టింది పేరు...
డేగ జాతి కోళ్లు పోరాట పటిమకు ప్రసిద్ధి. ఇవి చూడముచ్చటగా ఉండటంతో పాటు.. చురుగ్గా కదులుతాయి. సంక్రాంతి వేళ కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడే వేరు. నెమలి జాతి కోళ్లు 3 కేజీల వరకు తూగుతాయి. మంచి కండపుష్టి ఉండటంతోపాటు కళ్లు చురుగ్గా ఉంటాయి. కాలి గోళ్లు బలంగా, మొనదేలి ఉంటాయి.
పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి ఏ పుంజుతో...
పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి.. కోడి రంగు, జాతిని ఎంపిక చేసి ఆ రోజున ఏ పుంజుతో పందెం వేయాలో.. ఆ రంగు ఉన్న కోడి పుంజుతోనే పందేలు వేస్తారు. 13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు గెలుపొందుతాయని.. 14వ తేదీ యాసర కాకి డేగలు, కాకి నెమళ్లు, పసిమగల్ల కాకులు, కాకి డేగలకు చెందిన పుంజులు గెలుపొందితే... 15వ తేదీన డేగలు, ఎర్రకాకి డేగలు గెలుస్తాయని పందేళ్లో ప్రావీణ్యం ఉన్న వారి నమ్మకం.