ఉత్తర కూటమి నాయకుడు దివంగత అహ్మద్ షా మసౌద్ అనుచరుడైన సలేహ్.. "తాలిబన్లతో కలిసి తాను ఎప్పుడూ ఒకే గొడుగు కింద ఉండబోనని" స్పష్టం చేశారు. పాకిస్తాన్‌పై కొన్నేళ్లుగా విమర్శలు చేస్తున్న సలేహ్.. తాజాగా మరోసారి పాక్‌పై విరుచుకుపడ్డారు. పాక్ "అణచివేతను, నియంతృత్వాన్ని" ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
48 ఏళ్ల సలేహ్.. కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీ. దూరంలో తజిక్ ఆధిపత్యంలో ఉన్న పంజ్‌షీర్ లోయ ప్రాంతంలో జన్మించారు. అఫ్గానిస్తాన్‌ను 1987 నుంచి రష్యా మద్దతుతో పరిపాలించిన మహమ్మద్ నజీబుల్లాను 1992లో తొలగించిన తర్వాత జరిగిన అంతర్యుద్ధం సమయంలో సలేహ్.. తాలిబన్ వ్యతిరేక కూటమి సభ్యుడుగా పని చేశారు. 1990లలో అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రాయోజిత తాలిబాన్ పాలనపై పోరాడుతున్న ఉత్తర కూటమికి భారతదేశం సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించినట్లు మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ సరన్.. హౌ ఇండియా సీస్ ది వరల్డ్ (2017)లో రాశారు.
1997లో అహ్మద్ షా మసూద్... సలేహ్ను ఉత్తరాది తాలిబన్ వ్యతిరేక కూటమి అనుసంధానకర్తగా నియమించారు. ఈ హోదాలో పలు అంతర్జాతీయ ఎన్జీవోలు, ఏజెన్సీలతో సంబంధాలు, లావాదేవీలు జరిపారు సలేహ్.
2004లో అమెరికా నేతృత్వంలో... అఫ్గానిస్తాన్‌లో సంకీర్ణ తాలిబన్ పాలనను కూల్చివేసిన మూడేళ్ల తర్వాత సలేహ్ అఫ్గానిస్తాన్ గూఢచర్య సంస్థకు అధిపతి అయి.. 2010 వరకు సేవలందించారు. తాలిబన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని, పాకిస్తాన్ మద్దతుపై ఆధారపడుతున్నారని అప్పటి అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ను తీవ్రంగా విమర్శించేవారు సలేహ్. ఆ క్రమంలోనే తాలిబన్లను వ్యతిరేకించడమే లక్ష్యంగా బసేజ్-ఏ మిల్లీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.
2017లో అష్రఫ్ ఘనీ కేబినెట్‌లో చేరారు సలేహ్. 2018లో అంతర్గత వ్యవహారాల మంత్రిగా పని చేశారు. ఫిబ్రవరి 2020లో దేశ ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. సలేహ్‌పై అనేక సార్లు హత్యాయత్నాలు కూడా జరిగాయి. సెప్టెంబర్ 9, 2020న జరిగిన దాడి చివరిది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. దోహాలో ఆఫ్ఘన్-తాలిబన్ చర్చలను అడ్డుకునేందుకు ఈ ఘటన ఎంతగానో దోహదం చేసింది.
కాబుల్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి సలేహ్ పంజ్‌షీర్ లోయకు మకాం మార్చినట్లు తెలిసింది. అక్కడ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసూద్, అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ మహమ్మదీల భాగస్వామ్యంతో కూడిన తాలిబన్ వ్యతిరేక ఫ్రంట్‌లో భాగంగా పనిచేస్తున్నారు సలేహ్.