తెలంగాణ

telangana

By

Published : Sep 29, 2019, 6:53 AM IST

ETV Bharat / city

నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి?

శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు భక్తకోటి. అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి పూజించుకునే భక్తులు... నైవేద్యం విషయంలోనూ అంతే జాగ్రత్త వహిస్తారు. కానీ ఏ రోజు ఏ ప్రసాదం పెడితే అమ్మవారి కృపాకటాక్షాలు లభిస్తాయో వివరించే దుర్గగుడి స్థానాచార్యులతో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి?

నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి?

అమ్మవారి కటాక్షం కోసం...
దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. నైవేద్యాలకూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇళ్లలో అమ్మవారిని ప్రతిష్టించుకుని పూజలు చేసుకునే వారు తమ శక్తి కొలది ప్రసాదాలు సిద్ధం చేస్తారు. కానీ ఏ రోజు ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనేది మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. శాస్త్రోక్తంగా అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యాలు పెడితే అమ్మవారి కృపాకటాక్షాలు సిద్ధిస్తాయో స్వయంగా ప్రసాదాలు సిద్ధం చేసి మరీ వివరిస్తున్నారు దుర్గ గుడి స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ సతీమణి విష్ణుభట్ల పద్మావతి.

ఈ ఏడాది దసరా ఉత్సవాలు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్యీయుజ శుద్ధ దశమి వరకు జరగునున్నాయి. పది రోజులు అమ్మవారికి ఒకో రోజు ఒ‍కో ప్రసాదం నివేదించాలి.

  • తొలి రోజు అమ్మవారికి పాలు, అన్నం కలగలిపిన పదార్థాన్ని నివేదించాలి.
  • రెండో రోజు అమ్మవారికి పెరుగన్నం, పప్పుదినులతో నైవేద్యాన్ని నివేదించాలి.
  • మూడో రోజు అమ్మవారికి బియ్యం, బెల్లం, నెయ్యి కలిపి సిద్ధం చేసిన అప్పాలను నివేదించాలి.
  • నాలుగోరోజు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన పులిహోర నివేదించాలి.
  • ఐదో రోజు అమ్మవారికి చెక్కరపొంగలి సమర్పించాలి.
  • ఆరో రోజున శాకాన్నాన్ని నివేదించాలి. అంటే వివిధ రకాల కూరగాయలు, ఆరు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసే అన్నప్రసాదాన్ని అమ్మవారికి ఆ రోజు నివేదించాలి.
  • ఏడో రోజు శనివారం అమ్మవారికి కొబ్బరితో సిద్ధం చేసిన ప్రసాదాన్ని అంటే కొబ్బరి అన్నాన్ని నివేదించాలి.
  • దుర్గాష్టమి రోజున అమ్మవారికి అత్యంత ప్రియమైన మినుములతో తయారు చేసిన చిట్టిగారెలు సమర్పించాలి.
  • నవమి రోజు అమ్మవారికి నువ్వులతో సిద్ధం చేసిన నైవేద్యాన్ని నివేదించాలి.
  • ఇక చివరగా దశమి రోజున అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, చింతపండు పులుసుతో కలిపి సిద్ధం చేసే కదంబ ప్రసాదాన్ని నివేదించాలి.

దేవీ భాగవతంలో చెప్పిన విధంగా అమ్మవారికి తిథి, వార, నక్షత్రాలు బట్టి నైవేద్యం చేయాలి. కొన్ని సందర్భాల్లో దసరా ఉత్సవాల్లో తిథి, వార, నక్షత్రాల మధ్య సంధి కుదరకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అమ్మవారికి పంచభోగాలు నివేదిస్తే ... జగన్మాత సంతృప్తి చెందుతుంది. ఈ ఏడాది దేవీ నవరాత్రులు ఆశ్వీయుజ పాడ్యమి నుంచే మొదలైనందున తిథి, వార, నక్షత్రాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ నైవేద్యాల తయారీ విషయంలో సందిగ్ధత వద్దనుకునేవారు పంచభోగాలు నివేదిస్తే అమ్మవారి కరుణాకటాక్షాలు సిద్ధిస్తాయంటున్నా రు శివప్రాసద్ శర్మ దంపతులు.

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువుదీరిన దేవీ నవరాత్రుల సమయంలో ...ఇంట్లో కలశం పెట్టుకుని అమ్మవారిని రోజుకో రూపంలో కొలిచే భక్తులు నైవేద్యాల విషయంలో సైతం నియమాలు పాటిస్తే... అంతా మంచే జరుగుతుందని... మనోవాంఛ ఫలిస్తుందంటున్నారు వేదపండితులు.

ABOUT THE AUTHOR

...view details