కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన నాలుగు కేసులు హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టులో వీగిపోయాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై కొడంగల్, మద్దూరు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల కొట్టివేసింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణకు నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానానికి ఎంపీలు బండి సంజయ్, అసదుద్దీన్ ఒవైసీ, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సీతక్క, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు.
నాన్ బెయిలబుల్ వారంట్ వెనక్కి..
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై గతంలో జారీచేసిన నాన్ బెయిలబుల్ వారంట్‌ను న్యాయస్థానం ఉపసంహరించింది. పాతబస్తీ మీర్‌పేటలో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలపై దాడి ఘటనకు సంబంధించిన కేసులో అసదుద్దీన్ హాజరు కాకపోవడం వల్ల గతంలో ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. సోమవారం జరిగిన విచారణకు హాజరైన అసదుద్దీన్.. వారంట్ వెనక్కి తీసుకోవాలని కోరడాన్ని కోర్టు అంగీకరించింది.