ఏపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. కాగ్ ఆదేశాల మేరకు ఆడిట్ విభాగం అధికారులు రాష్ట్ర ఆర్థికశాఖలో కార్పొరేషన్ల అప్పులను 2 రోజులుగా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆడిట్ అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సత్య’దూరమైన లెక్కలు అందిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం కార్పొరేషన్లపై తెచ్చిన అప్పుల భారం మరీ ఎక్కువ ఉన్నా తక్కువ చేసి చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం లక్షా69వేల905 కోట్ల రూపాయలకు గ్యారంటీలు ఇచ్చింది. తాజాగా మరో 7వేల కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ కార్పొరేషన్ల అప్పుల భారం 2022 మార్చి 31 నాటికి లక్షా38వేల605 కోట్ల రూపాయలు ఉన్నట్లు వివిధ గణాంకాలు పేర్కొంటున్నాయి.