ఆంధ్రప్రదేశ్‌లో కొన్నివేల మంది కొవిడ్ బారినపడి విషమ పరిస్థితుల్లోకి వెళ్లారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవటంతో శ్వాస తీసుకోవటంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉండటంతో మరింత ఆందోళనకరమైన పరిస్థితులు చవిచూశారు. వీరిలో ఆరు పదుల వయసు దాటిన ఒకరైతే ఏకంగా మూడు రోజులపాటు కోమాలో ఉండిపోయారు. మరొకరైతే తన పక్కనే ప్రతి రోజూ ఇద్దరు, ముగ్గురు కొవిడ్ బాధితులు చనిపోతున్నా ధైర్యం కోల్పోలేదు. ఇక్కడ చికిత్స చేయటం చాలా కష్టమని, మరో పెద్ద నగరానికి తీసుకెళ్లండంటూ వైద్యులే చెప్పినా.. మనోబలంతో అక్కడే వైద్యం పొంది కరోనాను గెలిచాడు ఓ యువకుడు. సకాలంలో వైద్యుల్ని ఆశ్రయించి గండం గట్టెక్కారు ఓ పెద్దాయన. మహమ్మారి నుంచి బయటపడే క్రమంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.
కుటుంబమంతా ఆక్సిజన్‌పైనే ఉన్నాం..
తొలుత మా నాన్న జె.ఎల్.పెరుమాళ్లు(64)కు కొవిడ్ నిర్ధారణైంది. మూడు, నాలుగు రోజుల తర్వాత నాకు, మా అమ్మకు లక్షణాలు మొదలయ్యాయి. హెచ్‌ఆర్‌సీటీ స్కాన్ చేయిస్తే అందరికీ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటివరకూ మేమంతా హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నాం. ఒక్కసారిగా మా నాన్నకు ఆయాసం మొదలైంది. ఆక్సిజన్ స్థాయి 85 శాతానికి పడిపోయింది. మా అమ్మకు కూడా అదే సమయంలో ఆక్సిజన్ శాతం తగ్గటం మొదలైంది. నాకూ శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మా ముగ్గురికీ మధుమేహం ఉండటం, ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బందులు ఎదురవటంతో ఆసుపత్రిలో చేరాం. ముగ్గురినీ ఆక్సిజన్‌పైనే ఉంచారు. ఆరు రోజుల చికిత్స తర్వాత అమ్మ చనిపోయారు. అప్పటికి నేను కొద్దిగా కోలుకున్నా.. మా నాన్న పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. ఒకానొక దశలో ఆయన ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోయింది. మా అమ్మ మరణవార్తను వెంటనే ఆయనకు చెప్పలేదు. భయపడినా, ఆందోళన చెందినా ప్రాణాలకే ప్రమాదమని అర్థమై.. ఏదైతే అదయ్యిందని నిబ్బరంగా ఉన్నాం. ఏడు రోజుల తర్వాత నన్ను డిశ్ఛార్జి చేస్తామన్నారు. కానీ నాన్న ఒక్కరే ఉంటే మరింత ఆందోళన పడతారని.. ఆయన కోలుకునే వరకూ అక్కడే ఉన్నా. మొత్తంగా 14 రోజుల పాటు ఆయన కృత్రిమంగా ఆక్సిజన్ తీసుకోవాల్సి వచ్చింది. కేవలం మనోస్థైర్యం, వైద్యులు అందించిన చికిత్స వల్లే ఆయన, నేను అత్యంత విషమ పరిస్థితుల్లో నుంచి బయటపడ్డాం. ఆసుపత్రి నుంచి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మా నాన్నకు కాన్సంట్రేటర్ ద్వారా ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. అయితే ప్రాణానికేమీ ప్రమాదం లేదు.
-జె.రాజగోపాల్ (35), వ్యాపారి, మంగళగిరి
ఇప్పటికీ నీరసమే...
కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకున్నా.. పాజిటివ్ అని నిర్ధారణయ్యాక స్థానికంగా చికిత్స తీసుకోవటం మొదలుపెట్టా. కానీ ఒక్కసారిగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోవటం ప్రారంభమైంది. నాకు మధుమేహం కూడా ఉండటంతో వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాను. పది రోజులు ఆక్సిజన్‌పైనే ఉన్నా. మొత్తం 15 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా. నా పక్కన చికిత్స తీసుకుంటున్న వారు ఒకరిద్దరు చనిపోయినా నేను ధైర్యంగానే ఉన్నా. నాకేమైనా అవుతుందేమోనన్న భయం ఎప్పుడూ కలగలేదు. స్టెరాయిడ్స్ వినియోగం వల్ల మధుమేహం స్థాయిలు కొంత పెరిగాయి. కోలుకున్నా ఇప్పటికీ నీరసంగానే ఉంది.
-పి.రామచంద్రరావు (54), శ్రీకాకుళం జిల్లా
జాప్యం చేస్తే చాలా ఇబ్బందయ్యేది
తొలుత నాకు జ్వరం వచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుంటే నాలుగు రోజులైనా ఫలితం రాలేదు. అయిదో రోజున జ్వరం కొనసాగుతుంటే ఆందోళనతో హెచ్‌ఆర్‌సీటీ స్కాన్ చేయించా. అప్పటికే ఊపిరితిత్తుల్లో 40 శాతం మేర ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తేలింది. గుండెదడ, శ్వాస తీసుకోవటంలో కొంచెం ఇబ్బంది మొదలయ్యాయి. నాకు పదేళ్లుగా రక్తపోటు ఉంది. ఇబ్బందవుతుందేమోనని భయపడి వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చేరాను. ఒక రోజంతా ఆక్సిజన్ పెట్టారు. 5 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నా. అక్కడ అందించిన వైద్యం, నాకేం కాదులే అన్న నమ్మకంతో కరోనా నుంచి బయటపడ్డా. సీటీస్కాన్ చేయించటం, ఆసుపత్రిలో చేరటంలో ఏ మాత్రం జాప్యమైనా.. చాలా ఇబ్బంది ఎదుర్కొనేవాణ్ని.
-సూర్యప్రకాశ్‌రెడ్డి (57),ఉపాధ్యాయుడు, గుంటూరు జిల్లా