తెలంగాణ

telangana

ETV Bharat / city

90Years of RTC : ఆర్టీసీ బస్సు రోడ్డెక్కి నేటికి 90 ఏళ్లు

90Years of RTC : ప్రగతి రథచక్రాలు పరుగులు పెట్టడం మొదలై నేటికి 90 వసంతాలవుతోంది. ఇప్పటికీ అలుపు, సొలుపు లేకుండా ఆర్టీసీ ప్రయాణమంటేనే సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమనే నినాదాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తోంది. పేదల పుష్పక విమానంగా పేరుగాంచిన ఎర్రబస్సు.. ప్రైవేట్‌ వాహనాలకు దీటుగా ఆధునిక హంగులనూ సమకూర్చుకుంది. సరకు రవాణాలోనూ సత్తా చాటుతోంది.

90 years of rtc
90 years of rtc

By

Published : Jun 15, 2022, 6:21 AM IST

సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే ఆర్టీసీకి..నేటితో 90ఏళ్లు

90Years of RTC : సరిగ్గా 90 ఏళ్ల క్రితం 27 బస్సులతో రోడ్డెక్కిన ఆర్టీసీ.. అనతికాలంలోనే ఆసియాలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గిన్నిస్‌ రికార్డులకు ఎక్కింది. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అందరి అభిమానాన్నీ చూరగొంది. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉద్యోగులతో కోట్లాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. రాష్ట్రంలోని ప్రతిఒక్కరితోనూ ఆర్టీసీ అనుబంధం పెనవేసుకుంది. నిజాం నవాబుల హయాంలో పురుడు పోసుకున్న ఆర్టీసీ.. నాటి నుంచి నేటివరకు రయ్‌రయ్‌మని దూసుకుపోతోంది.

1932 జూన్‌ 15న "నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌" పేరిట హైదరాబాద్‌ ఆర్టీసీకి బీజం పడింది. 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తల్లి కోరిక మేరకు... ఈ ప్రజారవాణా ఏర్పాటు చేశారు. తల్లి లక్ష వెండి నాణేలు సేకరించి ఇవ్వగా వాటిని విక్రయించి 27 అల్బేనియం బస్సులను బ్రిటన్‌ నుంచి ఓడల ద్వారా నిజాం నవాబు తెప్పించారు. తొలి బస్సు సర్వీస్‌ కాచిగూడ నుంచి ప్రారంభించారు. తల్లి జహర మహ్మడియన్ పేరు చిరకాలం గుర్తుండేలా బస్సు నెంబర్లలో జెడ్(Z)ని చేర్చి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించారు. నాటి నుంచి నేటి వరకు ఆర్టీసీ బస్సుల్లో Z-సీరిస్ కొనసాగుతోంది. నార్కట్‌పల్లిలో తొలి డిపో ఏర్పాటు చేయగా.. 1932లోనే ఖాజీపేట, నాందేడ్ డిపోలు ప్రారంభించారు. 27బస్సులు, 166 మంది సిబ్బందితో ప్రారంభమైన ఆర్టీసీ.. అనతికాలంలోనే ప్రజల మనసు చూరగొంది. 1949 నాటికి మొత్తం 21 డిపోలు 952 బస్సులకు చేరి ఎన్​ఎస్​ఆర్టీడీగా విస్తరించింది. 1946లో హైదరాబాద్ - సికింద్రాబాద్ మధ్య 30 డబుల్ డెక్కర్ బస్సులు నడపారు. కేంద్ర ప్రభుత్వం 1950లో ఆర్టీసీ యాక్ట్ తీసుకురాగా దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూల నిధుల సమీకరణతో అంచెలంచెలుగా విస్తరించింది. 1958 జనవరి 11 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపాంతరం చెందింది.

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బస్సు రూట్ల జాతీయకరణ చేయడంతో 1958 ఏప్రిల్ 1న విజయవాడలో డిపో ఏర్పాటు చేశారు. 1964న నవంబర్‌లో విజయవాడ - హైదరాబాద్ మధ్య దూర ప్రాంత డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రారంభించారు. ఆ తర్వాత పేదవాడి రవాణా వాహనంగా మారిపోయిన ఆర్టీసీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25 వేలకు పైగా బస్సులు, లక్ష మందికి పైగా సిబ్బందితో ఆసియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.

1989 వరకు లాభాల్లో నిలిచిన ఆర్టీసీ.. నూతన మోటారు వాహనాల చట్టం రాకతో నష్టాల బాట పట్టింది. ప్రైవేట్ వాహనాల్లోనూ ప్రయాణికులకు అనుమతివ్వడంతో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్టీసీకి ప్రభుత్వ కేపిటల్ కంట్రిబ్యూషన్‌ నిలిపేయడం, పన్నుల వసూళ్లు కలిపి... సంస్థ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ రెండుగా విడిపోయింది. ప్రస్తుతం నష్టాల నుంచి గట్టేందుకు సరకు రవాణా సహా పలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆర్టీసీ అన్వేషిస్తోంది.

ఇదీ చదవండి :ఉద్యోగాలే ఉద్యోగాలు.. కేంద్ర శాఖల్లో 10లక్షలు.. ఆర్మీలో 45వేలు

ABOUT THE AUTHOR

...view details