కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మొదలుకుని... వైద్యులు పోలీసులు పడుతున్న శ్రమ మొత్తాన్ని త్రిశూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ సింధు తొమ్మిదడుగుల చేనేత చీరపై హృద్యంగా చిత్రీకరించింది.
చీరపై కరోనా వారియర్స్ పోరాట చిత్రాలు - corona warriors images on saree
కరోనాపై వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు చేస్తున్న పోరాటానికి చక్కని రూపం ఇవ్వాలనుకుంది సింధు. ఇందుకు భారతీయ స్త్రీలు ఇష్టపడే చీరనే కాన్వాస్‌గా ఎంచుకుంది.
" ప్రపంచాన్ని కదిలిస్తున్న ఈ కరోనా వైరస్ కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతోమంది కష్టపడుతున్నారు. ఈ కష్టాలనే ఒక కథలా చెప్పాలనుకున్నా. ముందే స్క్రిప్టు రాసుకుని బొమ్మలు వేయడం మొదలుపెట్టా. రోగులకు ఓవైపు సేవలందిస్తూ, మరోవైపు వారి జీవితాలను కూడా ఫణంగా పెట్టి రాత్రీపగలూ విధులు నిర్వహిస్తున్న వారందరికీ గౌరవసూచకంగా ఈ చీరపై ప్రముఖస్థానాన్నిచ్చా. ఈ బొమ్మలు వేయడానికి 60 రోజులు పట్టింది. నా శ్రమ ఫలించి ఎంతోమంది వ్యాపారులు ఈ చీరని కొనడానికి ముందుకొస్తున్నారు. ఆ నగదును కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తా"నంటోంది సింధు.