ప్రతి పది నిమిషాలకు ఒకరు కరోనాతో గాంధీలో చేరిక - గాంధీలో పూర్తిస్థాయిలో కొవిడ్ సేవలు
16:27 April 16
నేటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా గాంధీలో సేవలు
కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో... నేటి నుంచి గాంధీ ఆస్పత్రిని మళ్లీ కొవిడ్ చికిత్సలకే పరిమితం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది మార్చి 24న తొలిసారిగా గాంధీ ఆస్పత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా సర్కారు ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 20 వరకు... పూర్తిగా కొవిడ్ సేవలకే గాంధీ అంకింతమైంది. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో... మళ్లీ నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించారు.
కరోనా రెండోదశలో భాగంగా... ప్రస్తుతం రాష్ట్రంలో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఆస్పత్రిలో మొత్తం 1,850 పడకలుండగా.. 700 కొవిడ్ బాధితులకు కేటాయించారు. గురువారం నాటికి 450 మంది చికిత్స పొందుతుంటే... శుక్రవారం ఒక్కరోజే మరో 150 మంది చేరారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పటికే ఇన్‌పేషెంట్ బ్లాకు మొత్తం నిండిపోయింది. కొత్తవారిని చేర్చుకోలేని పరిస్థితి నెలకొందని భావించిన ఆస్పత్రి అధికారులు...ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లారు.
శనివారం నుంచి పూర్తిస్థాయి కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడ వివిధ రోగాలతో చికిత్స పొందుతున్న వెయ్యి మందిని ఒకట్రెండు రోజుల్లో ఇతర వైద్యశాలలకు తరలించడమో, ఇళ్లకు పంపించడమో చేస్తామని తెలిపారు. తద్వారా 1,850 పడకలు పూర్తిగా కరోనా రోగులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ఏడాది మహమ్మారి విజృంభించిన సమయంలోనూ గాంధీ ఆస్పత్రి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. గాంధీని పూర్తిస్థాయి కరోనా వైద్య సేవా కేంద్రంగా మార్చడం రోగులకు ఉపకరించనుంది.