ఏపీలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులను బెదిరిస్తూ ఎంత పెద్దవారు ప్రకటన చేసినా లెక్క చేయాల్సిన పనిలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఉద్యోగులు, అధికారులను అస్థిరపరిచేలా చేసే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్ఈసీ తేల్చి చెప్పారు. అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామంటూ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఎస్ఈసీ ఓ ప్రకటన జారీ చేశారు.
అభద్రతా భావన అవసరం లేదు..
పంచాయతీ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, కీలక బాధ్యతలు వహిస్తున్న రిటర్నింగ్ అధికారులకు ఎలాంటి అభద్రతా భావన అవసరం లేదని నిమ్మగడ్డ రమేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా చట్టప్రకారం బాధ్యతలు నిర్వహించే అధికారులకు రాజ్యాంగం పూర్తి రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని.. వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు చేపట్టాలన్నా ఎస్ఈసీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ముందస్తు అనుమతి లేకుండా చర్యలను నిషేధిస్తూ త్వరలో ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టం చేశారు.