కరోనా రెండో దశ ఉద్ధృతితో ఏప్రిల్ 20న మూతబడిన విద్యాసంస్థల్లో.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సందడి మొదలు కానుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ 1 నుంచి 10వ తరగతితోపాటు ఇంటర్మీడియట్ రెండో ఏడాది విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. గదుల కొరత ఉన్న విద్యాసంస్థల్లో రెండు విడతలుగా తరగతులు నిర్వహిస్తారు. పాఠశాల ఆవరణల్లో గ్రామ, వార్డు సచివాలయాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా.. కొన్నిచోట్ల ఇప్పటికీ కొనసాగుతుండటం విద్యార్థులకు ఇబ్బందిగా మారనుంది. పాఠశాల విద్యలో నూతన విద్యావిధానం అమలు చేయనున్నారు.
ఆరు విభాగాలుగా పాఠశాల విద్యావ్యవస్థ
ఇప్పటివరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అనే మూడు విభాగాలుగా ఉన్న పాఠశాల విద్యావ్యవస్థను.. ఆరు విభాగాలుగా మారుస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్య(పీపీ)-1, 2 నిర్వహించే అంగన్‌వాడీలు.. శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా మారతాయి. పీపీ-1, 2తోపాటు ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్‌గా, పీపీ-1, 2తోపాటు 1 నుంచి 5తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్, 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకు ఉంటే ప్రీ-హైస్కూళ్లు, 3 నుంచి 10వరకు ఉన్నత పాఠశాలలు, 3 నుంచి 12 వరకు హైస్కూల్ ప్లస్‌గా ఉంటాయి.