తెలంగాణ

telangana

ETV Bharat / city

పాఠశాల విద్యలోనే కొత్త ఒరవడి.. "మన ఊరు మన బడి" - మన బస్తీ మన బడి

Mana Ooru Mana Badi Programme: ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, మౌలికవసతుల మెరుగుదలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని అమలు చేయనుంది. కార్యక్రమ విధివిధానాలు ప్రకటించడంతో పాటు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పాఠశాల విద్యలోనే కొత్త ఒరవడి మన ఊరు మన బడి
Schools Development in Mana Ooru Mana Badi Programme in telangana

By

Published : Feb 3, 2022, 9:22 PM IST

Updated : Jun 27, 2022, 12:02 PM IST

Mana Ooru Mana Badi Programme: మన ఊరు మన బడి కార్యక్రమం పాఠశాల విద్యలో కొత్త ఒరవడి సృష్టించి.. దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమ సన్నాహక సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, తదితరులు పాల్గొన్నారు. మన ఊరు- మన బడి కోసం ప్రత్యేక సాఫ్ట్​వేర్ అభివృద్ధి చేయాలని టీసీఎస్ ప్రతినిధులను మంత్రి కోరారు. పాఠశాలల వారీగా జాబితా రూపొందించి పూర్తి స్థాయి నివేదికను త్వరగా అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 7 వేల 289 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి తెలిపారు. తొలి విడతలో 9 వేల 123 పాఠశాలల్లో 12 రకాల కనీస సదుపాయాలను కల్పించడానికి 3 వేల 497 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని పాఠశాలల్లో పనులను స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఆంగ్ల మాధ్యమంతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి పేదల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. త్వరలో జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పథకం అమలుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని మంత్రి తెలిపారు.

కార్యక్రమ ఉద్దేశమేమిటంటే..

ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, మౌలికవసతుల మెరుగుదలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని అమలు చేయనుంది. కార్యక్రమ విధివిధానాలు ప్రకటించడంతో పాటు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో మౌలికవసతులు మెరుగుపరిచి, మరమ్మతులు చేయడం, డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులకు పూర్తి స్థాయిలో చదువుకునే వాతావరణాన్ని కల్పించడం, ఎన్​రోల్​మెంట్, హాజరు శాతం పెంచడం, నాణ్యమైన విద్యాబోధన కల్పించడం లాంటి అంశాలే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

ఎంత ఖర్చు చేస్తున్నారంటే..

గ్రామాల్లో మన ఊరు - మన బడి పేరిట.. పట్టణాల్లో మన బస్తీ - మన బడి పేరిట ఈ కార్యక్రామాన్ని అమలు చేయనున్నారు. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం అమలు కోసం 7289 కోట్ల 54 లక్షలు ఖర్చవుతాయని ప్రభుత్వ అంచనా. మొదటి దశలో 2021-22 సంవత్సరంలో మూడో వంతు పాఠశాలల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొత్తం అన్ని పాఠశాలల్లోని 35 శాతం 9,123 పాఠశాలల్లో తొలి విడత కార్యక్రమం అమలు కానుంది. మండలం యూనిట్​గా అన్ని కేటగిరీల పాఠశాలలను ఎంపిక చేస్తారు. మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా, ఫర్నీచర్, మరమ్మతులు, కిచెన్ షెడ్స్, కొత్త తరగతి గదులు, డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్య అమలు తదితర మొత్తం 12 అంశాలపై దృష్టి సారిస్తారు. మొదటి దశలోని 9123 పాఠశాలల్లో కార్యక్రమం అమలు కోసం 3497.62 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు.

ఎలా చేస్తారంటే..

పాఠశాల విద్యా కమిటీల ద్వారా కార్యక్రమాన్ని అమలు చేస్తారు. సమగ్రశిక్ష, ఉపాధి హామీ, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, జిల్లా, మండల పరిషత్ నిధులు, ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు, నాబార్డు, జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులను వినియోగిస్తారు. మన ఊరు - మన బడిలో భాగంగా ప్రతి పాఠశాలకు పూర్వ విద్యార్థుల సంఘాన్ని విధిగా ఏర్పాటు చేయాలి. పాఠశాలల అభివృద్ధి కోసం విరాళాలు, సీఎస్ఆర్ నిధులు ప్రోత్సహించాలని, ఇందుకోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఎవరైనా పది లక్షల రూపాయలు, అంతకు పైబడి విరాళంగా ఇస్తే ఒక తరగతికి వారు సూచించిన పేరు పెడతారు. మరమ్మతులు, నిర్మాణానికి అవసరమైన సిమెంట్​ను రైతువేదికల తరహాలో నిర్ణీత ధరలకు అందించేలా చూడాలని... ఉచితంగా ఇసుక లభించేలా చూడాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:

Last Updated : Jun 27, 2022, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details