ఆర్థికంగా మాల, మాదిగ కన్నా ఉపకులాల కుటుంబాలు వెనుకబడి ఉన్న దృష్ట్యా.. ఆ వర్గాలను పైకి తీసుకురావల్సిన అవసరం ఉందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావును కలిసి ఉపకులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
'మాల, మాదిగల ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్'
రాష్ట్రంలో మాల, మాదిగల్లో ఉపకులాల కుటుంబాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక సాయం అందేలా చూడాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. హైదరాబాద్ సైఫాబాద్ అరణ్య భవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిసి వినతి పత్రం అందజేశారు.
బడ్జెట్ కేటాయింపులు, రుణాలు ఇచ్చే విషయంలో ఉపకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రిని కోరారు. అన్ని కులాలను ఆదరించినట్లే.. మాల, మాదిగ ఉపకులాల్లో వృత్తి పని చేసే వారిని ఆదుకోవాలని విన్నవించారు. తెలంగాణ ఆవిర్భావంతో వెనుకబడిన షెడ్యూల్ కులాల్లోని ఉపకులాల్లో మంచి మార్పు వస్తుందని... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
వారి సమస్యలు విన్న మంత్రి హరీశ్‌రావు... త్వరలోనే ఈ విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఎస్సీ ఉపకులాల ఐక్య వేదిక కన్వీనర్ చింతల మల్లికార్జున్, డక్కల సంఘం అధ్యక్షుడు మంగేష్, ఒలియ సంఘం అధ్యక్షుడు వీరేశం, మాస్ట్రిన్ సంఘం కిష్టయ్య, చిందు సంఘం స్వామి, మేడి బుడిగ జంగం హనుమంతు, మాల, మాదిగలలోని 59 ఉపకులాల నేతలు ఉన్నారు.