ఢీ అంటే ఢీ.. 6 నుంచి 8 నిమిషాలపాటు బరిలో పోరు.. తగ్గేదే లే.. అంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడే తీరు... సంక్రాంతి సంబురాలకు కోళ్లు రెఢీ అయ్యాయి. గ్రామీణులకు సంప్రదాయం.. పందెం రాయుళ్లకు ఉత్కంఠ భరిత జూదం... చూసేవాళ్లకు సరదాల సంబరమైన పందేనికి కోళ్లను ఎలా సిద్ధం చేస్తారనేదీ ఆసక్తికరం. 2 నెలల వయసున్నప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ మొదలుపెట్టి 16 నెలల నుంచి 18 నెలలొచ్చాక పోటీకి దించుతారు.
ఆహారమిలా...
కొన్నిచోట్ల వానాకాలం ముగియగానే... మరికొన్ని చోట్ల దసరా నుంచి కోళ్లకు శిక్షణ ఇవ్వడం మొదలవుతుంది. పందెంకోళ్లకు ప్రత్యేక ఆహారాన్నిస్తారు. 40 రోజులపాటు కోడిగుడ్డు (పచ్చసొన లేకుండా) పెడతారు. 60 రోజులపాటు బాదం పప్పు (6 నుంచి 10), ఖీమా (30 గ్రాముల వరకు), బీకాంప్లెక్స్ ట్యాబ్లెట్లు ఇస్తారు. రెండు రోజులకోసారి కిస్‌మిస్‌లు, దానిమ్మ గింజలు, ఖర్జూరం పెడతారు. క్యారెట్, తోటకూర, కొత్తిమీరను ఉడకబెట్టి తినిపిస్తారు.
సన్నద్ధత ఇలా...
- కొన్ని రోజులు కోడిని ఎండలో కట్టేస్తారు. ఈకలు కొంత విడిపోతున్నప్పుడు నీడలోకి తీసుకొస్తారు.
- శరీరం చురుగ్గా ఉండేందుకు వారానికోసారి 10 నిమిషాలపాటు ఈత కొట్టిస్తారు.
- కొవ్వు చేరకుండా యూకలిప్టస్ ఆకులు, కుంకుడు ఆకులు, వెదురు ఆకులు నీటిలో వేసి బాగా మరగబెట్టాక కొద్దిగా చల్లబరిచి పుంజుకు స్నానం చేయిస్తారు. దీన్నే నీరుపోతలు అంటారు.
- కఫం పట్టకుండా, శరీరం గట్టిపడేందుకు శాకాలు(ఆవిరి పట్టడం లాంటిది) తీస్తారు. దీన్ని ఒక్కోచోట ఒకలా చేస్తుంటారు. పెనంమీద సారా/చీప్ లిక్కర్ వేసి దాన్నుంచి వచ్చే ఆవిరిని పట్టిస్తారు. దీనివల్ల కోడి ఒళ్లు గట్టిపడుతుందని నమ్ము తారు. పోటీలో దెబ్బ తగిలినా తట్టు కునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- కాళ్లపై ఒకేచోట నిల్చుని ఉంటే పాదాలపై మొత్తం బరువు పడుతుంది. దీనివల్ల పుంజు చురుకుగా కదల్లేదు. అందువల్లే ఒకేచోట ఉంచకుండా నడక-పరుగు మధ్యలో ఉండేలా కొద్దిగా వేగంగా 2 నుంచి 4 నిమిషాలపాటు ఇసుకలో నడిపిస్తారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో రెండు పూటలా మసాజ్ చేయిస్తారు. చురుగ్గా పరిగెత్తడంపై సాధన చేయిస్తారు.
- చలికాలంలో కోళ్లకు గురకలు, తెగుళ్లు రాకుండా వ్యాక్సిన్లు ఇప్పిస్తారు. బలం కోసం ఇంజెక్షన్లు వేస్తారు.
నిపుణుల శిక్షణలో...
పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లకు దాదాపు వందకుపైగా శిక్షణ కేంద్రాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువశాతం ఆక్వా చెరువుల వద్దనే ‘కోళ్ల దొడ్ల’ను నిర్వహిస్తున్నారు. ఇతరచోట్ల కల్లాల్లోనూ పెంచుతున్నారు. స్థానికంగా అనుభవం ఉన్నవారితో కొన్ని కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. రావులపాలెం లాంటి చోట్ల శిక్షణ కోసం కోల్‌కతా నుంచి నిపుణులను తీసుకొస్తున్నారు. కొందరు హైదరాబాద్ బార్కాస్‌లో పహిల్వాన్‌ల వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందిన పుంజులను కొని, పోటీ ముందు వరకు వారితోనే శిక్షణనిప్పిస్తున్నారు. శిక్షకులకు వేతనం నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలు ఇస్తున్నారు. శిక్షణ కేంద్రాల నిర్వహణకు శ్రీకాకుళం, విశాఖ గ్రామీణ ప్రాంతాల నుంచి కుటుంబాలను తీసుకొస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ‘కాక్ ట్రైనింగ్ సెంటర్స్’ పేరుతో ప్రత్యేకంగా ఈ కోళ్ల పెంపకం చేపడుతున్నారు. సంప్రదాయం మీద అభిమానంతో కొంతమంది, ఉపాధి (స్టార్టప్) కోసం మరికొంత మంది ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొత్త బ్రీడ్‌లను అభివృద్ధి చేయడం, ఇతర దేశాల నుంచి కొత్త రకం బ్రీడ్‌లను తీసుకువచ్చి ఇక్కడి కోడిపుంజుల (పోటీల్లో గెలిచినవే ప్రధానంగా) బ్రీడ్‌తో కలిపి కొత్త బ్రీడ్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలనూ చేస్తున్నారు. ఆచంట, యలమంచిలి, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, పెదవేగి, భీమవరం, పోడూరు, పోలవరం మండలాల్లో అత్యధికంగా ప్రధాన శిక్షణ కేంద్రాలున్నాయి. ఒక్కో శిక్షణ కేంద్రంలో 150 కోళ్ల వరకు పెంచుతారు.