తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. 35 వేల మంది విధులకు దూరం..! - పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

తొమ్మిది ప్రధాన డిమాండ్లతో ఏపీలో పారిశుద్ధ్య కార్మికులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దాదాపు 35 వేల మంది విధులకు దూరం కానున్నారు. వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నేటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. 35 వేల మంది విధులకు దూరం..!
నేటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. 35 వేల మంది విధులకు దూరం..!

By

Published : Jul 11, 2022, 7:45 AM IST

ఆంధ్రప్రదేశ్​లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు పూనుకున్నారు. అధికారులతో చర్చలు విఫలమవడంతో పుర, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లోని దాదాపు 35 వేల మంది కార్మికులు, ఉద్యోగులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకునే వరకు సమ్మె కొనసాగించాలని నిర్ణయించినట్లు మున్సిపల్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆదివారం వెల్లడించింది. 9 ప్రధాన డిమాండ్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు గత నెలలో సమ్మె నోటీసులిచ్చాయి. పురపాలకశాఖ కమిషనర్​ ప్రవీణ్‌ కుమార్‌ కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్‌ విభాగాల్లోని ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్లు కె.ఉమామహేశ్వరరావు, సుబ్బారాయుడు తెలిపారు. ప్రజారోగ్య విభాగంలోని శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు తమకు సంఘీభావంగా సమ్మెలో పాల్గొంటున్నారని వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు..
పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో వర్షాలతో ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ప్రధాన నగరాల్లో ప్రైవేటు కార్మికులను రంగంలోకి దింపుతున్నారు. విజయవాడలో ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. మచిలీపట్నంలో అక్కడి ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల కార్మిక సంఘాల నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంకొన్ని జిల్లాల్లో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రధాన డిమాండ్లివి..

  • ఆరోగ్య భత్యం బకాయిలతో సహా చెల్లించాలి.
  • 11వ పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం నెల జీతం రూ.20వేలు, కరవు భత్యం ఇవ్వాలి.
  • మున్సిపల్‌ పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలి.
  • పట్టణాల విస్తరణ మేరకు కార్మికులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి.
  • ఆప్కాస్‌ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలి.
  • రిటైర్‌ అయిన వారికి గ్రాట్యుటీ,పెన్షన్‌ చెల్లించాలి.
  • ఇంజినీరింగ్‌ కార్మికులకు జీవో 30 ప్రకారం నైపుణ్య, నైపుణ్యేతర జీతాలివ్వాలి.
  • శాశ్వత ఉద్యోగులకు ఆర్జిత సెలవు, జీపీఎఫ్‌ ఖాతాలు తెరవడంతోపాటు హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి.
  • ఎన్‌ఎంఆర్‌లకు టైమ్‌ స్కేల్‌, కరవు భత్యం, పాఠశాలల్లోని ఆయాలకు కనీస వేతనం చెల్లించాలి.

ABOUT THE AUTHOR

...view details