ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడమే ఆలస్యం.. అప్పుడే నకిలీ విత్తనాలు వ్యాపారం ఊపందుకుంది. గ్రామాల్లో నకిలీ విత్తనాల వ్యాపారులు ఆ విత్తనాలు అమ్మడానికి రంగం సిద్ధంచేశారు. ‘కలుపు మొక్కలను చంపే గ్లైఫోసెట్ మందులను తట్టుకుని బతికే’(హెచ్‌టీ), జన్యుమార్పిడి(జీఎం) పత్తి విత్తనాల అమ్మకం, సాగును కేంద్రం దేశంలోకి అనుమతించలేదు. ప్రస్తుతం వీటిని సాధారణ బీటీ పత్తి విత్తనాలంటూ వ్యాపారులు అమ్మేస్తున్నారు. ఇతర పంటల నాసిరకం విత్తనాలనూ అమ్ముతున్నారు.
నకిలీలలు ఎన్నెన్నో
బీటీ పత్తి విత్తనాలను 450 గ్రాముల చొప్పున ఒక్కో ప్యాకెట్‌లో ప్యాక్ చేసి, దానిపై తయారీ కంపెనీ వివరాలన్నీ ముద్రించాలి. కానీ బస్తాల్లో నింపి రైతులకు కిలోల చొప్పున విడిగా అమ్ముతున్నారు. తాజాగా మహబూబాబాద్‌లో 33 బస్తాల్లో విడి పత్తి గింజలు, అక్రమంగా ప్యాక్ చేసినవి పట్టుబడ్డాయి. గత మార్చి నుంచి రాష్ట్రంలో పోలీసులు ఇలా విక్రయిస్తున్న 10 వేల క్వింటాళ్లకు పైగా విత్తనాలను సీజ్ చేశారు. మొత్తం 42 మందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు. పక్కనున్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నాసిరకం, హెచ్‌టీ విత్తనాలు పెద్దఎత్తున బస్తాల్లో తెస్తున్నారు.