అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేందుకు 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగుల సహకార పరపతి సంఘం(సీసీఎస్) పేరుతో నెలవారీగా దాచుకున్న సొమ్ము వడ్డీతో కలిపి రూ.726.74 కోట్లు అయింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుంది. తిరిగి చెల్లించనందున... పొదుపు చేసుకున్న సొమ్ము నుంచి రుణం తీసుకునేందుకు కార్మికులు సుమారు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. తక్షణం కొంత మొత్తాన్ని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించినా స్పందన లేదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం సగం జీతమే ఇస్తోంది. పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నా చెల్లించలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక అవసరాల కోసం సీసీఎస్‌లో పొదుపు చేసుకున్న మొత్తం నుంచి రుణం తీసుకునేందుకు అవకాశం లేకపోవటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వాడుకున్న తమ సొమ్మును తమకు ఇవ్వాలంటూ సీసీఎస్ కార్యాలయంలో పాలకవర్గం బుధవారం మౌనదీక్ష చేపట్టడంతో ఆ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.