RSP: ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. పీకేలాంటి మాంత్రికుల్ని తీసుకొచ్చినా.. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించి ప్రగతి భవన్‌పై నీలి జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. తమ పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తుందని, ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. ‘సొంత బలంపై ఏనుగు ప్రగతి భవన్‌కు వెళ్తుంది. అప్పుడే బహుజనుల బతుకులు మారతాయి’ అని అన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా శుక్రవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అభినందన సభను నిర్వహించారు. ఈ సభలోను, విలేకరుల సమావేశంలోను ఆయన మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా, తెరాస ప్రభుత్వాల్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బీఎస్పీని చూసి భయపడుతున్న తెరాస, భాజపా, కాంగ్రెస్:రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ప్రజల ఆస్తుల్ని, కష్టార్జితాన్ని దోచుకుని ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా విందులు, విలాసాలకు ఖర్చు పెడుతున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ప్రజలు, ఉద్యోగస్తులు, పేదలందరి జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సిన దుస్థితిని తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ‘‘బీఎస్పీని చూసి తెరాస, కాంగ్రెస్, భాజపాలు భయపడుతున్నాయి. అందుకే సమాజంలో చీలికలు తీసుకొచ్చేందుకు అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నాయి. అలాగే తెలంగాణలో ప్రజలపై డబ్బులు వెదజల్లి.. మత్తులో ముంచి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేసీఆర్ పన్నాగం పన్నారు. వాటిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బీఎస్పీ కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాలి. కేంద్రంలోని భాజపా.. రాజ్యాంగాన్ని ప్రణాళికబద్ధంగా నిర్మూలించే కుట్ర చేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోంది.