హైదరాబాద్ నగరంలో సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై అక్రమార్కులు కన్నేశారు. ప్రభుత్వ భూమిలో ఎకరా ప్రైవేటు స్థలం ఉందంటూ తప్పుడు పత్రాలు తెచ్చుకున్నారు. ఒకరు ఆక్రమించారు కదా అని మరొకరు రెండోవైపు నుంచి మొదలుపెట్టారు. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోకుండా పైస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఓ పోలీస్ ఉన్నతాధికారికి అనుమానం వచ్చి ఆరా తీయగా..ఈ ఆక్రమణ బాగోతం వెలుగుచూసింది. సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్‌లో సర్వే నంబర్లు 74/10, 74/9లలో ఇదంతా జరిగింది. ఈ స్థలం పక్కనే మారేడ్‌పల్లి తహశీల్దార్ కార్యాలయం, తుకారంగేట్ ఠాణా ఉన్నా వీరేమాత్రం పట్టించుకోవడం లేదు. పోలీస్ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొద్దిరోజుల క్రితం తహశీల్దార్ ఎట్టకేలకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆక్రమణలను మాత్రం రెవెన్యూ అధికారులు ఇంకా తొలగించలేదు.
ప్రభుత్వ భూమి అని తెలిసినా..
సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో వందల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిని ఆక్రమించేందుకు కొన్నేళ్ల నుంచి అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు, కమ్యూనిటీహాళ్ల కోసం, ఇతర అవసరాల కోసం కేటాయించిన భూముల వివరాలను సేకరించి సర్వే నంబర్ల ఆధారంగా తప్పుడు దస్తావేజులు సృష్టించడం, వాటి ఆధారంగా కబ్జా చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే మారేడ్‌పల్లి తహశీల్దార్ కార్యాలయానికి సమీపంలోని సర్వే నంబర్లు 74/10, 74/9లలో ఉన్న ఐదెకరాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల దృష్టిపడింది. అందులో ఎకరా భూమి తమదేనంటూ కొందరు పత్రాలు సృష్టించారు. ఇంకేముంది ఆ స్థలంలో షెడ్లు వేశారు. కొద్దిరోజులుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఎకరం పేరుతో మూడొంతుల భూమిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
రెండోవైపు కమ్మేశారు..