పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంతో భాజపా, కాంగ్రెస్ నేతలకు, వారి పిల్లలకే సంబంధాలున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. భాజపా నాయకురాలు ఉప్పల శారద కుమారుడు అభిషేక్ పబ్ నిర్వహిస్తున్నారని... అందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి ఉన్నారని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
మేనల్లుడినే అదుపులో పెట్టలేని రేవంత్ రెడ్డి.. ప్రజలకేమి సేవ చేస్తారన్న బాల్క సుమన్... ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. నిజ స్వరూపం బయట పడినందున భాజపా, కాంగ్రెస్ నేతలు తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ సంస్కృతి, విచ్చలవిడితనం భాజపా, కాంగ్రెస్ నేతలు, వారి పిల్లల్లోనే ఉందని విమర్శించారు. పోలీసుల కస్టడీ విచారణలో ఇంకా చాలా విషయాలు వస్తాయని చెప్పారు.