Land Registration charges Hike at New Districts: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడిన కొద్ది గంటల్లోనే మార్కెట్ విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డనకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త జిల్లాల కార్యకలాపాలు అధికారికంగా సోమవారం ఉదయం ప్రారంభం కాగా.. మధ్యాహ్నానికి కొన్ని జిల్లాకేంద్రాలు, శివార్లలో మార్కెట్ విలువల పెంపునకు ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 11 కొత్త జిల్లాకేంద్రాల్లో మార్కెట్ విలువల పెంపు బుధవారంనుంచి అమలుకానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో స్థిరాస్తి రంగం పుంజుకుంటుందన్న ఉద్దేశంతో రెవెన్యూ శాఖ ఈ చర్యలు తీసుకుంది. దీనివల్ల కొనుగోలుదారులపై ఆర్థిక భారం పెరగనుంది.
రేణిగుంటలో అనూహ్యంగా 432% పెంపు!:తిరుపతి కొత్త జిల్లాలోని రేణిగుంట పరిధిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. పారిశ్రామికవాడ రేణిగుంట మండలం అనగుంటలో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ.7.52 లక్షలు ఉండగా.. తాజాగా రూ.40 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదించారు. అంటే ఏకంగా 432 శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రగుంట పరిధిలో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ.9.01 లక్షలుండగా.. ఇప్పుడు రూ.50 లక్షలకు ప్రతిపాదించారు. ఏకంగా 455 శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త జిల్లాకేంద్రం అనకాపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20-40% మధ్య మార్కెట్ విలువల పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు.
విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాకేంద్రం చుట్టుపక్కల 15% వరకు పెంపు ఉండనుంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకేంద్రాల్లో 20-25% వరకు మార్కెట్ విలువల పెంపునకు తగ్గట్టు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పలుచోట్ల ఇంతకంటే ఎక్కువ మొత్తంతో మార్కెట్ విలువలు ప్రతిపాదించారు. దాదాపు ఇవే అమల్లోకి వచ్చే అవకాశముంది. జిల్లాస్థాయిలోనే అధికారిక నిర్ణయాలు జరుగుతాయి. కొత్త జిల్లాల ఏర్పాటును అవకాశంగా తీసుకుని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కొద్దిరోజుల కిందటే మార్కెట్ విలువల (స్పెషల్ రివిజన్)ను జిల్లా అధికారుల ద్వారా ప్రతిపాదించి అమలుకు నిరీక్షిస్తోంది. ఈ ఆదేశాలను సోమవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ్ జారీ చేశారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ వి.రామకృష్ణ జిల్లా అధికారులకు ఉత్తర్వులిచ్చారు.