Revanth Reddy Comments: మునుగోడు ఉపఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతుండడం వల్ల నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై, ధరల పెరుగుదల వల్ల పేదలపై పడ్డ భారం మీద చర్చ జరగాల్సి ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదలు బ్రతకలేని పరిస్థితి తెచ్చిందని కేంద్రపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెరాస, భాజపా ప్రభుత్వాల వల్ల మోసపోయామని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. 22 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మోదీ కేవలం ఏడు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు.
ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన భాధ్యత కాంగ్రెస్‌పై ఉందని రేవంత్ తెలిపారు. భాజపా పాలనలో పేదలు, రైతులు, యువకులు మోసపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 5000 కోట్ల ప్యాకేజీ ప్రకటించి భాజపా ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. చెప్పిందే చెప్పి కేసీఆర్ కూడా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలపై, విధానాలపై మునుగోడులో చర్చ జరగాల్సి ఉందని.. వ్యక్తిగత దూషణలు అవసరం లేదని తెగేసి చెప్పారు.