తెలంగాణలో ప్రస్తుతం వినియోగిస్తున్న నీటితోపాటు, నిర్మాణంలో ఉన్న జలాశయాల కింద 428.30 టీఎంసీలను సాగునీటి అవసరాలకు వినియోగించుకోనున్నారు. పారిశ్రామిక అవసరాలకు 88.66 టీంఎసీలు, తాగునీటి అవసరాలకు(మిషన్ భగీరథ) 217.13 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. జలాశయాల్లో కనీస మట్టం కింద(డెడ్ స్టోరేజీ) 235.51 టీఎంసీలు, వినియోగించుకునేందుకు (లైవ్ స్టోరేజ్) 634.76 టీఎంసీలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 125 జలాశయాలు ఉండగా వీటిలో 52 ఇప్పటికే పూర్తయ్యాయి. పనులు కొనసాగుతున్నవి 72. వీటిలోనూ కొన్ని చివరి దశలో ఉన్నాయి. ఒకటి ప్రతిపాదనల దశలో ఉంది. కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతలు కలిపి 153 భారీ ఎత్తిపోతల పథకాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ మేరకు ఇటీవల సిద్ధం చేసిన ప్రాజెక్టుల నిర్వహణ విధానం(పీఎంఎస్) పోర్టల్లో వివరాలను పొందుపర్చారు.
తొలిసారిగా శాఖ పేరుతో యాజమాన్య హక్కులు
నీటిపారుదల శాఖ పరిధిలోని ఆస్తుల గుర్తింపునకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో శాఖకు చెందిన 12.80 లక్షల ఎకరాల భూముల వివరాలు తేలాయి. ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో పట్టాదారులు, అటవీశాఖ, ప్రభుత్వం నుంచి సేకరించిన భూ విస్తీర్ణం ఇది. వీటిలో భూసేకరణ కింద రైతులకు పరిహారం చెల్లించినా ఏళ్లతరబడి ఈ భూములకు యాజమాన్య హక్కులు మాత్రం రైతుల పేరుతోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన ఆస్తుల గుర్తింపులో ఇంజినీర్ల బృందం దాదాపు ఐదున్నర లక్షల ఎకరాలను శాఖ పేరుతో మ్యుటేషన్లు చేయించడంతో శాఖకు యాజమాన్య హక్కులు లభించాయి.