తెలంగాణ

telangana

ETV Bharat / city

'పురుగు పట్టొద్దు.. పోషకాలు తగ్గొద్దు..' పప్పుధాన్యాలపై పరిశోధనలు - Gene editing‌

దేశ ప్రజల ఆహార భద్రత కోసం జన్యు కూర్పు జన్యు మార్పుపై జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు ప్రత్యేకదృష్టి సారించాయి. పలు పంటల పరిశోధన సంస్థలతో పాటు జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ కూడా కొత్త వంగడాల్లో జన్యు కూర్పు, జన్యు మార్పు అంశాలపై దృష్టి పెట్టాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మిరప పంటపై తామర పురుగు వంటి కొత్త తెగులు సోకడంతో వాటిని తట్టుకునేలా వంగడాల్లో జన్యు కూర్పు, మార్పుపై పరిశోధనలు చేసి కొత్త వంగడాలు తేవాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Research on legumes such as kandi and senaga
Research on legumes such as kandi and senaga

By

Published : Mar 9, 2022, 6:38 AM IST

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా, ఏపీలోని మారేడుమిల్లి, చింతపల్లి.. అడవుల్లో పెరిగే అడవి కంది రకాలు తక్కువ గింజలతో కూడిన కాయలు కాస్తున్నాయి. ఈ మొక్కలకు పురుగు, తెగుళ్లు పెద్దగా సోకడం లేదు. ఈ వంగడాల్లోని జన్యువులను తెచ్చి సాధారణ దేశీ కంది, పెసర వంగడాల్లోని జన్యువులతో సంకరపరిచి కొత్త వంగడాలను సృష్టించారు. వీటితో పండించిన కందులు, పెసర పంటలను ఎక్కువ రోజులు పురుగులు సోకకుండా నిల్వ చేయవచ్చని తేలింది. వీటిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా జాతీయ పప్పుధాన్యాల పరిశోధన సంస్థను, ఎన్‌బీపీజీఆర్‌లను ఆదేశించింది. మరో 3, 4 ఏళ్లలో తెగుళ్లను తట్టుకునే సంకరజాతి కంది, పెసర వంటి కొత్త వంగడాలు అందుబాటులోకి రానున్నాయి.

మాంసకృత్తులు పెంచడానికి...

దేశంలో పండే ఆహార ధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉండేలా (బయోఫోర్టిఫైడ్‌) వంగడాలను అభివృద్ధి చేయాలని ‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’(సీఐఏఆర్‌) దేశంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో నూనెగింజలు, కూరగాయలు, పప్పుధాన్యాల పంటల విత్తనాల్లో మాంసకృత్తుల శాతం పెరిగేలా కొత్త వంగడాల సృష్టికి పరిశోధనలు చేపట్టారు. ఇందుకోసం వంగడాల్లో జన్యు కూర్పు, మార్పు ప్రాజెక్టులను చేపట్టారు. రాగులు, కొర్రలు, సామలు, ఊదలు తదితర తృణధాన్యాల పంటల్లో పోషకవిలువలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు నిత్యం ఆహారంలో తీసుకునే కంది, పెసర, సెనగ, వేరుసెనగపప్పుల వంటి వాటిలోనూ పోషకవిలువలు మరింత పెరగాలంటే జన్యు ఎడిటింగ్‌ అవసరమని అంచనా. ఇందుకోసం ఆయా పంటల వంగడాల్లో జీన్‌ సీక్వెన్సింగ్‌తో పటాలు సిద్ధం చేస్తున్నారు. వాటి ఆధారంగా పోషకవిలువలు పెంచడానికి అవసరమైన జన్యువులను చేర్చి కొత్త వంగడాలను సాగులోకి తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యం.

భవిష్యత్తులో అన్ని విత్తనాల్లో జన్యుమార్పులు

"పెరుగుతున్న ఆహార అవసరాల మేరకు అధిక దిగుబడినిస్తూ తెగుళ్లను తట్టుకునే సంకరజాతి వంగడాలను జన్యు కూర్పు, జీన్‌ ఎడిటింగ్‌ల ద్వారా తీసుకువచ్చేందుకు పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో అన్ని రకాల పంటల్లో ఇలాంటి విత్తనాలతో పంటలు సాగుచేయకతప్పదు." - ఎం.సోమసుందర్‌, విశ్రాంత ప్రధానశాస్త్రవేత్త, ఎన్‌బీపీజీఆర్‌

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details