తెలంగాణ

telangana

ETV Bharat / city

Remand prisoners: జైళ్లలో నెలల తరబడిగా మగ్గుతున్న రిమాండ్‌ ఖైదీలు - జైళ్లలో నెలల తరబడిగా మగ్గుతున్న రిమాండ్‌ ఖైదీలు

జైళ్లలో నెలల తరబడిగా రిమాండ్‌ ఖైదీలు (Remand prisoners) మగ్గుతున్నారు. బెయిల్‌ (bail) మంజూరైనా పూచీకత్తులు సమర్పించే తాహతు లేక బయటకు రాలేకపోతున్నారు. ఇలాంటి ఖైదీలు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నారు.

Remand prisoners
Remand prisoners: జైళ్లలో నెలల తరబడిగా మగ్గుతున్న రిమాండ్‌ ఖైదీలు

By

Published : Sep 30, 2021, 9:12 AM IST

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌లో గత డిసెంబరులో సోనమ్మ(70) అనే మహిళ హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో ఆమె కూతురు ఇందిర(50), మనమరాలు లక్ష్మి(30) ఈ హత్య చేశారని పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానం జ్యుడిషియల్‌ రిమాండ్‌ (Remand prisoners) విధించడంతో నిందితులను కంది జైలుకు తరలించారు. తొమ్మిది నెలలుగా తల్లీకుమార్తెలిద్దరూ జైలులోనే ఉన్నారు. ఇలాంటి నేరాల్లో 3 నెలల తర్వాత బెయిల్‌ తీసుకునే అవకాశముంటుంది. వారిద్దరికీ న్యాయసేవాధికార సంస్థ సహకారంతో బెయిల్‌ మంజూరైనా పూచీకత్తులు సమర్పించే తాహతు లేక బయటకు రాలేకపోతున్నారు. ఇలాంటి ఖైదీలు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నారు. సాధారణ నేరాల్లో 60 రోజులు, తీవ్రమైన నేరాల్లో 90 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌ కింద జైలులో ఉన్న వారికి తప్పనిసరి(మాండేటరీ) బెయిల్‌ తీసుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. బెయిల్‌ తీసుకునేందుకు న్యాయవాదిని సైతం సమకూర్చుకోలేని రిమాండ్‌ ఖైదీల కోసం జిల్లాలవారీగా న్యాయసేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలోని లీగల్‌ ఎయిడ్‌ అడ్వొకేట్ల సహకారంతో బెయిలొచ్చినా పలువురు జైళ్లలోనే మగ్గుతున్నారు.

ఒక పూచీకత్తయినా ఇవ్వలేక..

చాలా కేసుల్లో కుటుంబంలో సంపాదించే వ్యక్తి జైలుకు వెళితే వారి భార్యా, బిడ్డలు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. ఇలాంటి ఉదంతాల్లో లీగల్‌ ఎయిడ్‌ అడ్వొకేట్లు చొరవతీసుకుని.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళితే రెండు పూచీకత్తులకు బదులు ఒకటే సమర్పించేందుకు అనుమతి లభిస్తోంది. ఆ ఒక్కటీ సమకూర్చలేని పరిస్థితిలో పలువురు ఉంటున్నారు. సాధారణంగా న్యాయస్థానం అడిగిన పూచీకత్తు సమర్పించేందుకు ఇంటి విలువను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరైతే న్యాయస్థానం అడిగిన మొత్తాన్ని నగదు రూపంలోనే డిపాజిట్‌ చేసి ఆ పత్రాన్ని సమర్పిస్తున్నారు. నగదు సమకూర్చే స్తోమత లేనివారైతే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా పురపాలిక సంస్థ నుంచి ఇంటిపన్ను రశీదుతోపాటు ఇంటి విలువను నిర్ధారించే పత్రాల్ని న్యాయస్థానంలో సమర్పిస్తున్నారు. అలాంటి స్థాయి కూడా లేనివారు జైళ్లలోనే ఉండిపోతున్నారు.

శిక్ష కన్నా ఎక్కువ కాలం జైళ్లలోనే..

నేరం రుజువైతే ఖరారయ్యే శిక్ష కన్నా ఎక్కువ కాలం పలువురు జైళ్లలోనే మగ్గిపోతున్న ఉదంతాలూ ఉంటున్నాయి. చిన్నపాటి చోరీ కేసు రుజువైతే ఆరు నెలల వరకు శిక్ష పడే అవకాశముంటుంది. అలాంటి కేసుల్లో జైలుకొచ్చిన కొందరు ఖైదీలూ అంతకంటే ఎక్కువ కాలమే నాలుగు గోడలకు పరిమితమవుతుండటం గమనార్హం. రైల్వే పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాల్లో ఎక్కువగా ఈ తరహా ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఖైదీలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నట్లు తెలుస్తోంది. కొందరైతే కుటుంబసభ్యులకూ తెలియకుండా జైళ్లలో మగ్గిపోతున్నారు.

నిందితులు బెయిల్‌పై బయటికి వచ్చాక న్యాయస్థానంలో కేసు వాయిదాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మూడు వాయిదాలకు హాజరుకాకపోతే న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేస్తుంది. అలాంటప్పుడు సదరు నిందితుడికి పూచీకత్తు ఇచ్చిన వ్యక్తులూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే పలువురు ఖైదీలకు పూచీకత్తు లభించడం లేదనే భావనా వ్యక్తమవుతోంది. అయితే ఏ ఆదరణ లేనివారికి పూచీకత్తు ఇచ్చే విషయంలో స్వచ్ఛంద సంస్థలైనా చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details