తెలంగాణ

telangana

ETV Bharat / city

వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఉమ్మడి పరీక్ష.. సర్కార్​కు విద్యామండలి ప్రతిపాదన - Telangana State Higher Education Council

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మూడు మార్గాలను ప్రతిపాదించింది. కానీ.. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయాలంటే.. విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు తప్పనిసరి అని పలువురు ఉపకులపతులు భావిస్తున్నారు.

వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఉమ్మడి పరీక్ష
వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఉమ్మడి పరీక్ష

By

Published : Jul 20, 2021, 8:15 AM IST

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి మూడు మార్గాలను ప్రతిపాదించింది. వర్సిటీల్లో 1800 సహాయ, సహఆచార్యులు, ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో మొదటి విడతగా 1061 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం 2017 నవంబరులో అనుమతి ఇచ్చింది.

కమిటీల నియామకం..

రోస్టర్‌ పాయింట్ల ఖరారుపై తరుచూ వివాదాలు తలెత్తుతుండటం వల్ల వాటిని వర్సిటీల వారీగా నిర్దేశించేందుకు కమిటీలను నియమించాలని, వాటిలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలని ఉన్నత విద్యామండలి సూచించింది. బిహార్‌ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ఉమ్మడి వడపోత పరీక్ష నిర్వహించడం, ఆ పరీక్ష నిర్వహణను టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించడం, విశ్వవిద్యాలయాల వారీగా పరీక్ష నిర్వహించడం వంటి అంశాలను ప్రతిపాదించింది.

చట్టసవరణ తప్పనిసరి..

ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాలు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి ఆచార్యుల భర్తీ చేపడుతున్నాయని విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయాలంటే విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు తప్పనిసరని ఉప కులపతులు అభిప్రాయపడ్డారు. పరీక్ష అనంతరం ఇంటర్వ్యూలను వర్సిటీలే చేపడతాయా లేదా అన్న అంశంపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఉమ్మడి పరీక్ష ప్రతిపాదనను విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అది వర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరిస్తోందని, వర్సిటీల వారీగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాయి.

ఉమ్మడి పరీక్ష నిర్వహించాలి..

కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే అన్ని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు వాటిల్లో 30 నుంచి 40శాతం కొలువులు ఖాళీగా ఉన్నాయి.

స్వతంత్ర సంస్థ ఏర్పాటు..

గత ఫిబ్రవరి నాటికి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో.... 6,210 బోధన, 12,437 బోధనేతర, ఐఐటీల్లో.... 3,876 బోధన, 4,182 బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో సంస్థ నియామకాలు చేపట్టడం వల్ల ఖాళీల భర్తీలో జాప్యమవుతోందని గుర్తించిన కమిటీ.. ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని దాన్ని జాతీయ పరీక్షల మండలికి లేక యూపీఎస్‌కు అప్పగించాలని సూచించింది. లేకపోతే స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలని కోరింది.

ABOUT THE AUTHOR

...view details