Recommendations In JNTUH : జేఎన్‌టీయూహెచ్‌లో చిన్న చిన్న పదవుల కోసం కూడా కొందరు ఆచార్యులు పైరవీల బాట పడుతున్నారు. రిజిస్ట్రార్ నుంచి పరీక్షా విభాగంలో అదనపు కంట్రోలర్ పోస్టు వరకు ఏది కావాలన్నా మంత్రులతో సిఫారసులు చేయిస్తున్నారు. కొందరు నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేయిస్తుండగా.. మరికొందరు లేఖలను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పరిపాలనా పోస్టులకు మధ్యవర్తుల ద్వారా రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రార్ నియామకం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఉపకులపతి నర్సింహారెడ్డి కొద్ది నెలల క్రితం రిజిస్ట్రార్ ఆచార్య మంజూర్ హుస్సేన్‌ను తొలగించి రెక్టార్‌గా ఉన్న గోవర్ధన్‌ను నియమించారు. మరుసటి రోజే ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మళ్లీ మంజూర్ హుస్సేన్‌ను కొనసాగించారు. ఆయన కంటే ముందు ఆచార్య యాదయ్యను కూడా రిజిస్ట్రార్‌గా ప్రభుత్వమే నియమించింది. మంత్రుల సిఫార్సుల లేఖలు పెరుగుతుండటం వెనక మరో కోణం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వర్సిటీలో కీలక పదవిలో ఉన్న ఒకరు తాను కోరుకున్న వారితో మంత్రి ద్వారా సిఫారసు చేయిస్తే ఫలానా పదవి ఇస్తానని ముందుగానే సలహా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఆ పోస్టు ఎలా భర్తీ చేశారని, లేదా ఫలానా ఆయనకే ఎందుకు ఇచ్చారని ఎవరైనా అడిగితే మంత్రి సిఫారసు వల్ల ఇవ్వక తప్పలేదని చెప్పుకోడానికి వీలవుతుందని ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కొందరు అనుమానిస్తున్నారు.
అంబేడ్కర్ వర్సిటీ నుంచి డిప్యుటేషన్‌పై...
ఒకవైపు పరిపాలనా పోస్టుల కోసం పలువురు ఆచార్యులు పైరవీల్లో నిమగ్నంకాగా.. మరో వైపు వర్సిటీ అధికారులు అంబేడ్కర్ విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ధర్మను ఇటీవల స్టూడెంట్ అఫైర్స్ ఓఎస్‌డీగా నియమించుకోవడం గమనార్హం.
ఇదిగో పైరవీల గోల
- రిజిస్ట్రార్ పదవిపై కన్నేసిన ఒకరు ఇటీవల ఓ మంత్రికి వినతిపత్రం ఇచ్చి, దానిపై ‘పరిశీలించండి’ (ఎగ్జామిన్) అని రాయించుకొని తెచ్చి ఉపకులపతికి ఇచ్చినట్లు సమాచారం.
- సిరిసిల్లలో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమైంది. దానికి శాశ్వత ప్రిన్సిపల్ పోస్టు కోసం ఓ ఆచార్యుడు మంత్రి నుంచి సిఫార్సు లేఖ తెచ్చుకున్నట్లు సమాచారం.
- జగిత్యాల ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యుడు ఒకరు అకడమిక్ అండ్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ (డీఏపీ) పోస్టు కోసం మరో మంత్రి సిఫారసు లేఖతో ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
- జేఎన్‌టీయూహెచ్‌లో ఓ కీలక పదవి ఖాళీ అయితే తనకు ఇవ్వాలని వర్సిటీలోని మరో ఆచార్యుడు ఓ మంత్రి పేషీ నుంచి ఫోన్ చేయించినట్లు చెబుతున్నారు.
- పరీక్షల విభాగంలో అదనపు కంట్రోలర్ పోస్టుకు ఒకరు ఓ జిల్లా మంత్రి నుంచి ఫోన్ చేయించారు. దాంతో ఆ పదవిని భర్తీ చేశారు.