సినీ తారల డ్రగ్స్ కేసు(Tollywood drugs case) వ్యవహారంలో ఈడీ విచారణ ఆసక్తికరంగా మారుతోంది. మానీలాండరింగ్(money laundering)కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ 12మందికి నోటీసులు జారీ చేయగా విచారణకు ఒక్కొక్కరు హాజరవుతున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందును విచారించిన ఈడీ అధికారులు నిన్న దగ్గుబాటి రానాను కూడా సుధీర్ఘంగా విచారించారు. ఏడు గంటలకు పైగా సాగిన విచారణలో అతని బ్యాంకు వివరాలు, యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మత్తుమందు సరఫరాదారు కెల్విన్ వద్ద సేకరించిన బ్యాంకు లావాదేవీలతో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే గతంలో ప్రత్యేకంగా ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(enforcement directorate) విచారణలో రకుల్‌ప్రీత్‌సింగ్, రానా పేర్లు బయటకు రాలేదు. అయితే ఇప్పుడు ఈడీ చేపట్టిన దర్యాప్తులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసి విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో సేకరించిన లావాదేవీలకు, వారికి మధ్య..
మొన్న నటుడు నందును విచారిస్తున్న క్రమంలో కెల్విన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం, నిన్న రానాతోపాటు కెల్విన్ కూడా విచారణకు హాజరుకావడం వెనుక ఏమి జరిగిందో తెలియాల్సి ఉంది. మరోవైపు కెల్విన్ స్నేహితుడు వాహిద్ కూడా వరుసగా రెండు రోజులుగా విచారణకు హాజరవుతున్నాడు. మొదట నోటీసులు జారీ చేసిన వారిని విచారించి మధ్యలో కెల్విన్, వాహిద్‌ను పిలిచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. వారి నుంచి గతంలో సేకరించిన లావాదేవీలకు, విచారిస్తున్న వారికి మధ్య.. ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే కోణంలో ముందుకు సాగుతున్నారు. కొన్ని అనుమానస్పద లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.