మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయలోపం అత్యాచార బాధితులకు శాపమమవుతోంది. అత్యాచార బాధితులకు పరిహారం అందటం లేదు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పరిస్థితి ఇలా ఉంది.
అత్యాచార బాధితులకు అరకొర పరిహారం
By
Published : Aug 9, 2021, 12:14 PM IST
కూతురు వయసున్న బాలికను ఓ కామాంధుడు లోబర్చుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడికి శిక్ష పడింది. అత్యాచార బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారంలో రూ.50 వేలు మాత్రమే అందింది.
ఇంటర్ చదువుతున్న ఓ యువతికి ప్రేమ పేరుతో ఓ యువకుడు దగ్గరయ్యాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలంటూ పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడి తండ్రి ప్రముఖుడు కావడంతో ఏడాదిన్నర గడిచినా ఛార్జిషీటు దాఖలు చేయలేదు. పరిహారమూ ఇవ్వలేదు.
మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయలోపం అత్యాచార బాధితులకు శాపమమవుతోంది. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ రూ.లక్ష వరకూ పరిహారం అందిస్తుంది. ఠాణాలో కేసు నమోదయ్యాక రూ.25,000, న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశాక రూ.25,000, బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చిన అనంతరం రూ.50,000 ఇవ్వాలి.
మహిళలపై అత్యాచార ఘటనల్లో బాధితులకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ పరిహారం లభిస్తుంది. పరిహారం కోసం బాధితులు ఎఫ్‌ఐఆర్ కాపీని జతపర్చి ఐసీడీఎస్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన పలు కేసుల్లో ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం పోలీసులు తిప్పించుకోవడమో, ఇవ్వకపోవడమో చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా దరఖాస్తులు సమర్పించడంలో ఆలస్యం జరుగుతోంది. కొన్ని కేసులు రాజీ కుదుర్చుకోవటం వల్లనో, సరైన ఆధారాలు సేకరించకపోవటంతోనో వీగిపోతున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానూ బాధితులకు పరిహారం అందడం లేదు. దరఖాస్తుల సమర్పణ, అధికారుల ధ్రువీకరణలో జాప్యం కారణంగా బాధితులకు సకాలంలో పరిహారం అందట్లేదని తరుణి సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ మమతా రఘువీర్ తెలిపారు. తమ వద్దకు వచ్చిన దరఖాస్తులన్నీ పరిష్కరిస్తున్నామని ఐసీడీఎస్ జిల్లా సంక్షేమాధికారి అత్యవసరరావు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు బాధితులకు పరిహారం అందించడంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ జాప్యం జరుగుతోంది. అధికారులు సమన్వయంతో వ్యవహరించి సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలి.
- మూడేళ్ల క్రితం హైదరాబాద్ కలెక్టరేట్‌లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు వ్యక్తం చేసిన అభిప్రాయం