Rakesh Tikait About KCR : దేశంలో ఏం జరుగుతోంది.. రైతులు మరణిస్తూనే ఉండాలా? అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ సర్కార్ ధర్నా చేస్తోందన్న టికాయత్.. ఒక రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో పోరాడటం కేంద్రానికి సిగ్గుచేటని అన్నారు. ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందని చెప్పారు. కేంద్రం విధానంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని వాపోయారు.
Rakesh Tikait About TRS Protest : "తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ సీఎం చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదు. రైతుల కోసం మమతాబెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు. రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు. రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా వారికి మద్దతు ఉంటుంది. సాగుచట్టాల రద్దు కోసం దిల్లీలో 13 నెలలపాటు ఉద్యమించాం. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ.6 వేలు ఇస్తోంది. ఏడాదికి రూ.6 వేలు ఇస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది. తెలంగాణలో రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రైతుల కోసం కొట్లాడండి.. మేమే మీ వెంటే ఉంటాం. రైతుల కోసం ఉద్యమించడానికి తెలంగాణకు కూడా వస్తాం."