మోదీ ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం జాతీయ సంపదను అమ్మేస్తోందని రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఈ చర్యల వల్ల సామాన్యులు, దేశానికి జరిగే మేలేంటని ప్రశ్నించారు. ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల విలువైన ఆస్తులను అమ్మేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు.. నాడు నెహ్రు
నాడు జవహర్‌లాల్ నెహ్రు.. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చారని ఖర్గే పేర్కొన్నారు. వ్యాపారం వృద్ధి చెందితే దేశ సంపద పెరుగుతుందన్న ఆలోచన చేశారన్నారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం ద్వారా మిశ్రమ ఆర్థిక వృద్ధి జరుగుతుందని భావించారన్నారు.
ఇలా అయితే రిజర్వేషన్లు పోతాయి..
ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పిన ఖర్గే.. తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను... ప్రైవేటుపరం చేయడం వల్ల రిజర్వేషన్లు పూర్తిగా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టార్లను, బ్యాంకింగ్, రైల్వే, బీమా సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని విమర్శించారు.
పరిస్థితి ఇలానే ఉంటే..
ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1991లో పీవీ నరసింహారావు.. విదేశీ నిధులను ఆహ్వానించినా.. పబ్లిక్ సెక్టార్ యూనిట్లను ఇబ్బంది పెట్టలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్.. ప్రజాసంపదను కాపాడితే.. భాజపా మాత్రం వాటిని అమ్మేస్తోందని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్‌ను లూటీ చేయడం.. దోస్తులకు పంచి పెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే.. పేదల ఆర్థిక స్థితి మరింత దిగజారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవేనా అచ్చేదిన్..
'ప్రభుత్వరంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తూ ఆర్థిక భద్రత పొందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వల్లే హైదరాబాద్ పేరు విశ్వవ్యాప్తమైంది. అలాంటి రంగాన్ని మోదీ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా నాశనం చేస్తోంది. తొలుత 3 ఏళ్లలో 3లక్షల 50వేల కోట్ల ప్రజాసంపదను అమ్మడమో, లీజుకు ఇవ్వడమో చేశారు. ఆ చర్యల ద్వారా చివరికి రిజర్వేషన్లు లేకుండాపోతాయి. మోదీ ఎప్పుడూ అచ్చేదిన్ తీసుకొస్తామని అంటున్నారు. మంచి రోజులు అంటే ఇవేనా?.'
- మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ విపక్షనేత
MALLIKARJUN KHARGE:' ఆస్తులు లూఠీ చేయడం.. దోస్తులకు పంచిపెట్టడమే మోదీ పని' ఇదీచూడండి:modi - kcr meet: ప్రధాని మోదీకి పది లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్