ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయింది. నగరంలో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమలయయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డుపై పెద్ద వృక్షం విరిగిపడింది. సమాచారం అందుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ డీఆర్ఎఫ్ బృందంతో ఆ వృక్షాన్ని తొలగింపజేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నెరేడ్‌మెట్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కాలనీల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగాయి. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్ అబ్సిగూడ, నాచారంలో ఒక్కసారిగా భారీ వర్షం కారణంగా నీరు రోడ్లపైకి చేరింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. కొంపల్లి, సుచిత్ర, దుండిగల్, జీడీమెట్ల, షాపూర్‌నగర్, జగద్గిరిగుట్ట, చింతల్, బాలానగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి.
గాలివాన బీభత్సం..
నిర్మల్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో పలు చోట్ల భారీ వృక్షాలు నేలరాలాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. హన్మకొండ, వరంగల్, కాజీపేటల్లో రహదారులు జలమయమయ్యాయి. ధర్మసాగర్, వేలేరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. బచ్చన్నపేట, తరిగొప్పులు, నర్మెట్లలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.