తెలంగాణ

telangana

ETV Bharat / city

వర్షంతో చిగురించిన రైతుల ఆశలు - kothagudem

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అక్కడక్కడ ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. చెరువులు, కుంటలు వర్షపు నీటితో కళకళలాడుతున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు చేరుతోంది. కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం, సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

వర్షంతో చిగురించిన రైతుల ఆశలు

By

Published : Jul 29, 2019, 9:47 PM IST

Updated : Jul 29, 2019, 10:54 PM IST


రెండు రోజులుగా రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాగులు చెరువులు, కుంటలు, బావులు వర్షపు నీటితో కళకళలాడుతున్నాయి. పెద్దపెద్ద జలాశయాలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వర్షాకాలం ప్రారంభమై చాలా రోజులైన తర్వాత వర్షాల రాకతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరటం వల్ల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ కోసం తీసిన పైప్​లైన్లు ఉన్న చోట బురదతో పరిసరాలు అస్తవ్యస్థంగా మారాయి.

జలకళ...

నిర్మల్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండిపోయాయి. జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు నీటిమట్టం 1183 అడుగులు కాగా... 1172కు చేరింది. 700అడుగులున్న కడెం ప్రాజెక్టులో 686 అడుగులు, 1176.5 అడుగులున్న గడ్డెన్నవాగులోకి 1167 అడుగులకు చేరింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తడిసిముద్దైంది. సకాలంలో వర్షాలు రాలేదని నిరాశ చెందిన రైతులకు ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షం నీటితో భూగర్భ జలాలాలు పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

అక్కడక్కడా అంతరాయం

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడక్కడ రహదారులన్నీ బురదమయమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో మిషన్ భగీరథ కోసం తీసిన గుంతల్లో నీరు చేరి పరిసరాలు అస్తవ్యస్థంగా మారాయి. కుమురంభీం ఆసిఫాబాద్​లో ఎర్రవాగు ఉప్పొంగటం వల్ల 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగజ్​నగర్ బస్టాండ్ సమీపంలో చెట్టుకూలి విద్యుత్ తీగల మీద పడటం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది.

నిలిచిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం థర్మల్​ విద్యుత్​ కేంద్ర నిర్మాణం, సింగరేణి బొగ్గు గనుల పనులకు అంతరాయం ఏర్పడింది. థర్మల్​ విద్యుత్​ కేంద్రం ఆవరణంలో భారీగా నీరు నిలవటం వల్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మణుగూరులోని ఓసీ 2, ఓసీ4 గనుల్లోకి వర్షపు నీరు చేరడం వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వందలాది మంది కార్మికులు ఇంటికే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షంతో చిగురించిన రైతుల ఆశలు

ఇదీ చూడండి: చైనాలో వరుణుడి బీభత్సం.. పలు ప్రాంతాలు జలదిగ్భందం

Last Updated : Jul 29, 2019, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details