మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా కురుస్తున్న వర్షాలు...లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. వరద ఉద్ధృతికి రోడ్లు తెగి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మల్కాజిగిరి, నేరెడ్‌మెట్, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కుత్భుల్లాపూర్ నియోజకవర్గం వ్యాప్తిగా వానలు పడ్డాయి.
వాగు ఉద్ధృతికి ఒకరు బలి...
ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తడిసి ముద్దయింది. ఎన్నడూ లేని విధంగా గత వారం రోజులుగా కురుస్తున్న వానలతో గద్వాల పట్టణం పూర్తిగా జలమయమైంది. గద్వాల-రాయచూర్ రహదారిపై... వంతెన నీటిలో కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాయచూర్ నుంచి గద్వాలకు వెళ్తున్న లారీ వాగులో పడిపోయింది. పలు గ్రామాల్లో చెరువులకు గండిపడి పంటలు నీటమునిగాయి. జడ్చర్ల మండలం లింగంపేటలో దుందుభి వాగు వద్ద సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు...వాగులో కొట్టుకుపోయాడు.